రామగిరి, అక్టోబర్ 18 : బీసీ బంద్‌కు నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులంతా బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలియపరుస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యాపకులు “రాజ్యాధికారంలో మేమెంతో… మాకంత వాటా దక్కాలి” అనే నినాదాలను మిన్నంటిచారు. బీసీ జనాభా దామాషాకు అనుగుణంగా వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయానికి మూలస్తంభమని స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలోనూ, స్థానిక సంస్థలలోనూ కనీసం 42% రిజర్వేషన్లు కల్పించడం అత్యంత సమంజసమైన, న్యాయమైన చర్య అన్నారు. చారిత్రక, సామాజిక, ఆర్థిక వివక్షకు గురైన బీసీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలంటే, రిజర్వేషన్ల పెంపు తప్పనిసరి అన్నారు.
50 శాతం సీలింగ్ అంశాన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిగణనలోకి తీసుకుని, బీసీల రిజర్వేషన్ బిల్లులకు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి విద్యావేత్తలుగా, అధ్యాపకులుగా తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డా.పి.రవికుమార్, డా.అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా.మునిస్వామి, డా.వెల్దండి శ్రీధర్, డా.అనిల్ అబ్రహం, డా.ఆదె మల్లేశం, సుధాకర్, కాంట్రాక్ట్ అధ్యాపకులు, అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు.
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో బీసీ బంద్ శాంతియుతంగా కొనసాగింది. బంద్‌లో విద్యార్థి సంఘ నాయకులు, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, బీటెక్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మా హక్కులు దక్కే వరకు మా పోరాటం ఆగదు అని విద్యార్థి సంఘాలు ఈ సందర్భంగా ప్రకటించాయి.
Ramagiri : ‘మేమెంతో… మాకంత వాటా దక్కాలి’