కోదాడ, మార్చి 29 : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గుండెపంగు రమేశ్‌కు జాతీయ పురస్కారం లభించింది. సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో శనివారం మెగా హెల్పింగ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో సినీ హాస్యనటుడు బాబు మోహన్ చేతుల మీదుగా రమేశ్ బంగారు నంది ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా 50 సార్లు రక్తదానం చేయడంతో పాటు 6 వేల యూనిట్ల రక్తాన్ని దాతల నుంచి సేకరించి అవసరమైన రోగులకు అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మొక్కలు నాటడం, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సులు, తదితర సేవా కార్యక్రమాలకు అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు.