రామగిరి, సెప్టెంబర్ 01 : మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత “డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం – సమాలోచనం” అను అంశంపై ఈ నెల 19న ఒక్క రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలుగు శాఖ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల్ని కళాశాలలో నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించడానికి ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. సదస్సు నిర్వాహకుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్యను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు పాల్గొన్నారు.