నల్లగొండ ప్రతినిధి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్‌గా చింతకుంట నారాయణరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న దాసరి హరిచందనను జేఏడీకి బదిలీ చేశారు. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన హరిచందన జిల్లా కలెక్టర్‌గా 5నెలల 7 రోజుల పాటు పనిచేశారు.
ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ జిల్లాకు బదిలీ అయ్యి ఈ ఏడాది జనవరి 8న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కొద్ది కాలంలోనే హరిచందనకు పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణతోనే ఎక్కువ సమయం గడిచిపోయింది. ఎన్నికలు ముగిసి పాలనపై దృష్టి సారించే తరుణంలో ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నూతన కలెక్టర్ నారాయణరెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు.
జిల్లాకు నూతన కలెక్టర్‌గా నియమితులైన సి.నారాయణరెడ్డికి నల్లగొండ జిల్లాతో అనుబంధం ఉంది. జిల్లాల పునర్విభజన అనంతరం నల్లగొండ జిల్లాకు తొలి జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు సూర్యాపేట ఆర్డీఓగా పనిచేస్తూ జేసీగా నల్లగొండకు వచ్చారు. 2016 అక్టోబర్ 11 నుంచి 2019 ఫిబ్రవరి 28 వరకు నల్లగొండ జేసీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2 సంవత్సరాల నాలుగున్నర నెలలు జేసీగా అప్పట్లోనే జిల్లాపై తనదైన ముద్ర వేశారు. భూ రికార్డుల ప్రక్షాళనతోపాటు ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను ముందుభాగంలో నిలుపడంలో కీలకంగా వ్యవహరించారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు భూ సేకరణలోనూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి మన్ననలు పొందారు. జిల్లా నుంచే 2019 ఫిబ్రవరి 28న ములుగు జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.
అటవీ ప్రాంతంతో కూడిన ములుగు జిల్లాలో ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించి ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు నడిచారు. సమ్మక్క, సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని అదే ఏడాది డిసెంబర్లో గట్టమ్మ ఆలయం వద్ద 20 అడుగుల ఎత్తుతో ప్లాస్టిక్ కాలకేయుడి విగ్రహాన్ని రూపొందించి సంచలనం సృష్టించారు. ములుగు నుంచి 2019 డిసెంబర్ 24న నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయి కరోనా కాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తనదైన ముద్ర వేశారు. మూడేండ్లకు పైగా అక్కడ పనిచేసి గత ఏడాది ఫిబ్రవరి 2న వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన వికారాబాద్ జిల్లా నుంచి నల్లగొండ కలెక్టర్‌గా బదిలీపై వస్తున్నారు.
నారాయణరెడ్డి స్వస్థలం ప్రస్తుత నారాయణపేట జిల్లా నర్వ మండలం శ్రీపురం గ్రామం. సాధారణ రైతు కుటుంబంలో ఆరో సంతానంగా జన్మించిన ఆయన చదువులో ఎప్పుడూ ముందుండేవారు. ఏడో తరగతిలో ఉండగానే తండ్రిని కోల్పోయినా మండల టాపర్‌గా నిలిచారు. 1998 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో డివిజన్ టాపర్‌గా నిలిచారు. ఇంటర్, డిగ్రీలోనూ టాపర్‌గా ఉంటూ ఎడ్‌సెట్‌లో స్టేట్ 30వ ర్యాంకుతో ఓయూలో బీఈడీ పూర్తి చేశారు. పీజీ ఎంట్రన్స్‌లోనూ స్టేట్ 82వ ర్యాంకుతో ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేస్తుండగానే 2006లో డీఎస్సీ పడింది. దీంతో ఎమ్మెస్సీ ఆపేసి డీఎస్సీ రాసి మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచారు. 2008 ఫిబ్రవరిలో ఇచ్చిన పోస్టింగ్స్‌లో ఉపాధ్యాయుడిగా తాను చదువుకున్న కల్వాల్ స్కూల్లో బాధ్యతలు చేపట్టారు.
2007లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ప్రిపేర్ అయ్యారు. మెయిన్స్‌లో ఉమ్మడి రాష్ట్రంలో టాపర్‌గా నిలిచి ఇంటర్వ్యూతో కలిపి నాలుగో ర్యాంకును పొంది 2009లో డిప్యూటీ కలెక్టర్‌గా సెలక్ట్ అయ్యారు. శిక్షణ అనంతరం 2011 మే నెలలో గద్వాల ఆర్డీఓగా జాయిన్ అయ్యి మూడేండ్లు పనిచేశారు. అక్కడి నుంచి 2014 ఫిబ్రవరిలో పెద్దపల్లి ఆర్డీఓగా బదిలీ అయ్యారు. అక్కడి నుంచి 2016 జూలైలో సూర్యాపేట ఆర్డీఓగా బదిలీపై వచ్చి అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన జిల్లాల పునర్విభజనలో నల్లగొండ జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చారు. ఇక్కడి నుంచే కలెక్టర్‌గా పదోన్నతిపై మూలుగు జిల్లాకు వెళ్లారు. గతంలో జిల్లాతో అనుబంధం ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నడిపించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ నారాయణరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.