Ila Tripathi | ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ చండూరు మునిసిపల్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ, చండూరు గ్రామీణ ప్రాంతంలో తాగు నీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
చండూరు మున్సిపాలిటీతోపాటు, గ్రామపంచాయతీలలో జనాభా ఆధారంగా తాగునీటిని ఇవ్వాలని, ఎక్కడైనా మిషన్ భగీరథ తాగునీటి వనరులు, బోర్లు చెడిపోయిన, మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే గుర్తించి వాటి మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని సూచించారు. అలాగే పైపు లైన్ లీకేజీలను అరికట్టి తాగు నీరు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
తాగేందుకు మాత్రమే వాడాలి..
మిషన్ భగీరథ త్రాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియోగించాలన్నారు. తాగునీటి విషయంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉన్న జిఎస్ఎల్ఆర్ను పరిశీలించారు. అలాగే ఏడో వార్డులో నిర్మాణంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ను తనిఖీ చేశారు.
ఈ సమీక్షలో పాల్గొన్న వారిలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, చండూరు ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, పబ్లిక్ హెల్త్ డీఈ మనోహర ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పూజిత, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, ఎంపీడీవో రామిరెడ్డి తదితరులు ఉన్నారు.