సమైక్య పాలనలో కలలు గన్న నల్లగొండ ఐటీ హబ్.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమవుతున్నది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ఐటీ రంగం దేశానికే తలమానికంగా నిలుస్తున్న తరుణంలో జిల్లాకో ఐటీ టవర్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా కేంద్రానికి ఐటీ హబ్‌ను మంజూరు చేసింది. 2021 డిసెంబర్ 31న జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్ 18 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ఐటీ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70శాతం పనులు పూర్తి కాగా, వచ్చే జూలై నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నల్లగొండ ఐటీ హబ్ ద్వారా 1,600 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభించనున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నది రాష్ట్ర సర్కార్ లక్ష్యం. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లలో ఐటీ హబ్‌లను నిర్మించారు. తర్వాత దశలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలతో పాటు నల్లగొండకు ఐటీ హబ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రకటించిందే తడువుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2021 డిసెంబర్ 29న సీఎం కేసీఆర్ నల్లగొండను సందర్శించిన సందర్భంగా అభివృద్ధిపై సమీక్షిస్తూ పలు అభివృద్ధి పనులతో పాటు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ వెంటనే నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని స్థలాన్ని ఐటీ హబ్ కోసం ఎంపిక చేశారు. రెండ్రోజుల తేడాతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ పర్యటనకు వచ్చి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఐటీ హబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇదే సందర్భంగా జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలతో జూమ్ మీటింగ్ నిర్వహించి మీరు పుట్టిన గడ్డ నల్లగొండలో ఐటీ కంపెనీలు స్థాపించాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందిస్తూ పలువురు అక్కడికక్కడే కంపెనీల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే వెంటనే ఐటీ హబ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
1,600 మందికి ఉపాధి
ఐటీ హబ్ ద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి ఉపాధి లభించనుందని అంచనా. పరోక్షంగా మరో 500 మంది వరకు దీనిపై ఆధారపడి జీవనం సాగించవచ్చని చెబుతున్నారు. ఐటీ హబ్ నిర్మాణ సమయంలోనే 14 యూఎస్ బేస్డ్ కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నట్లు అంగీకారం తెలిపాయి. జిల్లాకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ సాఫ్ట్ట్వేర్ రంగ నిపుణులు అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లో తమ కంపెనీలను ఇప్పటికే రన్ చేస్తున్నారు. వీరు మాతృగడ్డపై మమకారంతో ఇక్కడ కూడా తమ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఐటీ హబ్ నిర్మాణం పూర్తయితే మరిన్ని కంపెనీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ ఐటీ హబ్ పూర్తయితే నల్లగొండ పట్టణానికి అదనపు హంగులు సమకూరనున్నాయి.
1.71లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం
ఐటీ హబ్‌ను మొత్తం ఏడు ఫ్లోర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లు పార్కింగ్, ఇతర అవసరాల కోసం వినియోగించనుండగా.. మిగతా ఐదు అంతస్తుల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువుగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా లోపల ఆఫీసు స్పేస్‌ను తీర్చిదిద్దనున్నారు. ఐదు అంతస్తుల్లో విశాలమైన హాళ్లతో ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ హాళ్లల్లోనే కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,71,320 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐటీ హబ్ నిర్మాణం కొనసాగుతుండగా ఆయా కంపెనీల సామర్థ్యాన్ని బట్టి ఆఫీసు స్పేస్‌ను కేటాయించనున్నారు. ఇక ఇక్కడే నైపుణ్య శిక్షణ కేంద్రం (టాస్క్)తో పాటు నూతన ఆవిష్కరణ ప్రోత్సాహానికి ఒక టీ హబ్‌ను కూడా మున్ముందు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
రూ.74 కోట్లతో నిర్మాణ పనులు
ముందుగా రూ.50కోట్ల అంచనాతో నల్లగొండ ఐటీ హబ్ మంజూరు చేసిన ప్రభుత్వం.. తుది అంచనా ప్రకారం రూ.74కోట్లతో ఆమోదం తెలిపింది. నల్లగొండ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోని సర్వే నంబర్ 1,517లో మొత్తం 3.10 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ హబ్ నిర్మాణం జరుగుతుంది. టీఎస్ఐఐసీ నోడల్ ఏజెన్సీగా గ్రీన్‌బెల్ట్ పర్యవేక్షణలో పనులు అత్యంత నాణ్యతతో కొనసాగేలా చర్యలు చేపట్టారు. గత ఏడాది జనవరిలో మొదలైన పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా అధికారులు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జూలై చివరి నాటికి ఐటీ హబ్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సామాన్యుల వరకూ ఐటీ ఫలాలు
ఐటీ ఫలాలు సామాన్యుల వరకూ అందాలన్నది సీఎం కేసీఆర్ తపన. అందుకే ఐటీ రంగానికి పెద్దపీట వేస్తున్నాం. ఐటీని ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే నల్లగొండలో టీ హబ్ నిర్మిస్తున్నాం. వచ్చే 18 నెలల్లో పూర్తి చేస్తాం. దీనివల్ల కొత్తగా 1,600 ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడమే ఐటీ హబ్‌ల ప్రధాన ఉద్దేశం.
– టీ హబ్ భూమిపూజ సమయంలో మంత్రి కేటీఆర్
త్వరలో అందుబాటులోకి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నల్లగొండపై ప్రత్యేక ప్రేమ ఉంది. నల్లగొండ రూపురేఖలు మార్చడానికి సంమృద్ధిగా నిధులు ఇస్తున్నారు. ఐటీ హబ్ నల్లగొండకు ఓ వరం. నల్లగొండకు తలమానికంగా, అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. ఐటీ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఇక్కడి నుంచే ఐటీ కంపెనీల కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలన్నదే లక్ష్యం. దీని ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
– కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే