సూర్యాపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేశ్‌రెడ్డికి ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామని చెప్పింది. కానీ ఆ హామీని మరిచి ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించింది. దాంతో రమేశ్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా న్యాయం జరుగుతుందా అని ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2018, 2023లో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ రమేశ్‌రెడ్డి సూర్యాపేట టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికే దక్కింది.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు రమేశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి పీసీపీ అధ్యక్షుడిగా ఉండగా టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా దామోదర్‌రెడ్డికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర నిరాశతో ఉన్న రమేశ్‌రెడ్డి పార్టీ మారే యోచనలో ఉండగా ఆయనను బుజ్జగించేందుకు ఏఐసీసీ పరిశీలకులు రోహిత్ చౌదరి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి సూర్యాపేటకు వచ్చారు. అప్పుడు రమేశ్‌రెడ్డి నివాసం వద్ద ఆయన అనుచరులు, మల్లు రవికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నేతలతో ఫోన్లో మాట్లాడించి రమేశ్‌రెడ్డిని బుజ్జగించారు.
కచ్చితంగా ఎంపీ టిక్కెట్ ఖాయమవుతుందని, ఢిల్లీ పెద్దలతో మాట్లాడానని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన లెటర్ ప్యాడ్‌పై రాసి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి తరఫున పటేల్ రమేశ్‌రెడ్డి ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం రఘువీర్‌రెడ్డికి ఎంపీ టికెట్ రావడం పట్ల రమేశ్‌రెడ్డి అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని నమ్ముకున్న రమేశ్‌రెడ్డి భవిష్యత్‌కు ఎలాంటి భరోసా ఇచ్చినట్లుగా కనిపించడం లేదని, రానున్న రోజుల్లో ఏదో జరుగుతుందన్న ధీమా కూడా లేకుండా పోతుందని రమేశ్‌రెడ్డి అనుచరలు వాపోతున్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డికే నల్లగొండ ఎంపీ టికెట్ ఖరారు అయ్యింది. డిగ్రీ పూర్తి చేసిన రఘువీర్‌కు భార్య లక్ష్మి, కుమార్తె ఈశ్వాన్వి, కుమారుడు గౌతమ్‌రెడ్డి ఉన్నారు. వ్యాపారాలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014, 2018లో పీసీసీ సభ్యుడిగా పనిచేయగా, 2021 నుంచి పీసీసీ జనరల్ సెక్రటరీగా పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి రఘువీర్ తమ్ముడు జయవీర్‌రెడ్డి శాసనసభ్యుడిగా విజయం సాధించారు.