నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 21 : మల్లన్నస్వామి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు, ఆలయ నిర్వాహకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన రెండు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ శివారులో చోటుచేసుకున్నది. కుమ్మెర గ్రామానికి చెందిన చిలుకేశ్వరం చాకలి చంద్రకళ తన కొడుకు గణేశ్, కోడలు మౌనికతోపాటు రెండు నెలల పసిపాపతో ఈ నెల 18న కుమ్మెర గట్టుపై ఉన్న మల్లన్నస్వామి దర్శనానికి వెళ్లారు.
టికెట్ తీసుకోవాలని ఆలయం వద్ద నిర్వహణలో ఉన్న వారు చెప్పారు. తాము గ్రామానికి చెందిన వారమేనని, తమ వద్ద అన్ని డబ్బులు లేవని, ఉచిత దర్శనం చేసుకుంటామని చెప్పడంతో ఇరువురి మధ్య తగాదా మొదలైంది. ఈ క్రమంలో మాటామాట పెరుగడంతో నిర్వాహకులు బూ తులు మాట్లాడుతూ వారిని తోసేశారు. ఇదేమని ప్రశ్నించిన చంద్రకళ కుమారుడు గణేశ్‌ను నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, మధు, శ్రీకాంత్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, కన్నిరెడ్డి తదితరులు సమీపంలోని కొబ్బరికాయలు అమ్మే దుకాణంలోకి తీసుకెళ్లి మూకుమ్మడిగా దాడి చేశా రు.
కిందపడేసి తొక్కారు. అడ్డు వెళ్లిన మహిళను తోసేసి మరీ దాడికి తెగబడ్డారు. ఆమె చంకలో ఉన్న పసికందును చూసైనా వదిలేయాలని ప్రాధేయపడినా వినకుండా దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగారు. పసికందు కిందపడటంతో కాళ్లతో తోసినట్టు తెలిసింది. గాయపడి.. అస్వస్థతకు గురైన శిశువును నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
చిన్నారి మృతదేహంతో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖాన ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దాడిచేసిన రెడ్లను అరెస్టు చేయాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని దవాఖాన ఎదుట చిన్నారి కుటుంటసభ్యులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆందోళనతో 3 గంటలకుపైగా ట్రాఫిక్ స్తంభించింది. సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు తుకారాంరెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగినట్టు స్థానికులు ఆరోపించారు. దాడి చేసిన ఉంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, మధు, శ్రీకాంత్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, కన్నిరెడ్డితోపాటు ఘటనకు సంబంధించి అన్ని విషయాలు తెలిసినా పక్కనే ఉండి దాడిచేయించిన కుమ్మెర సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నేత తుకారాంరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డి మాండ్ చేశారు. రిమాండ్ కాపీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని పొద్దుపోయే దా కా రోడ్డుపైనే భోజనాలు చేస్తూ భీష్మించారు.
దాడి ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబం వాపోయింది. సర్పంచ్ తుకారాంరెడ్డి పక్కనే ఉండి తమపై దాడి చేయించారని చంద్రకళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు బాధ్యులను అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.