నకిరేకల్, ఆగస్టు 23 : నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు మంగళవారం ఆయన ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
దేశంలోని 10 రాష్ర్టాల ముఖ్యమంత్రులను లొంగదీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం అన్నిరంగాల్లో దేశానికి చాటి చెప్పే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర బీజేపీ నాయకులు అనవసర రాద్ధ్దాంతంతో బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారన్నారు. నకిరేకల్ పట్టణంలో కొత్తగా 435 ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశామని, మరో 235 కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దాదాపు 3800 కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీ కృష్ణమూర్తి, కమిషనర్ బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు భిక్షంరెడ్డి, సునీల్, చింతా స్వాతీశివమూర్తి, కొండ శ్రీను, చౌగోని అఖిలాలక్ష్మణ్, వెంకన్న, సునీతారవీందర్, గడ్డం స్వామి, గర్షకోటి సైదులు, పల్లె విజయ్, రాములమ్మాసైదులు పాల్గొన్నారు.