యాదాద్రి, జూలై 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని ఆగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపం ఊయలలో అమ్మవారిని శయనింపు చేసి లాలిపాటలు పాడారు. నారసింహుడికి నిత్యారాధనలు అర్చక బృందం ఘనంగా చేపట్టారు. తెల్లవారుజాము 3గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు చేయడంతో పాటు, ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు.
స్వామివారి తిరువారాధన చేపట్టి అనంతరం ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామివారికి నిజాభిషేకం, తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఆర్జిత పూజలు కోలాహలంగా నిర్వహించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం జరిపి లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండిమొక్కు జోడు సేవలు, దర్బార్ సేవా కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. సత్యనారాయణ వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.8,73,934 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రావణ మాసం సందర్భంగా యాదగిరిగుట్ట ప్రధానాలయంలో దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపంలో నిర్వహించే ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎన్.గీత ఆన్లైన్ విక్రయాలను శుక్రవారం ప్రారంభించారు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్లో టికెట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. http://www.yadadritemple.telangana.gov.in/ అనే వెబ్సైట్లో టికెట్ల విక్రయాలకు సంబంధించిన వివరాలు ఉంటాయని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజుకు ఎంత మంది భక్తులు వచ్చినా కుంకుమార్చనలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 30రోజుల పాటు సాగే కోటి కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.