నందికొండ, ఆగస్టు 2 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీట మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్ గేట్ల లెవల్ 546 అడుగులను దాటి 551.30 (212.6510 టీఎంసీలు) అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టానికి మరో 39 అడుగులు మాత్రమే ఉండగా, రోజకు 10 టీఎంసీలకు పైనీరు వచ్చి చేరుతుండడంతో నిండుకుండలా మారుతుంది. వరద ఇదే తీరుగా కొనసాగితే మూడ్రోజుల్లో క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 4,89,361 క్యూసెక్కుల వరద పోటెత్తుతుండగా, డ్యామ్ క్రస్ట్ గేట్లు పదింటి ద్వారా, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 5,28,411 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం గంట గంటకు పెరుగుతున్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 5,292 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 778, ఎస్ఎల్బీసీ ద్వారా 1,650, వరద కాల్వ ద్వారా 400, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 23,744 క్యూసెక్కులు మొత్తం కలిపి 31,864 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విడుదల అవుతున్న అవుట్ ఫ్లోకు, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోకు ఎన్నెస్పీ అధికారులు లక్షల్లో వ్యత్యాసం చూపుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉదయం 4,85,201 అవుట్ ఫ్లో ఉండగా, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లో 3,36,543 క్యూసెక్కులుగా చూపారు. దీనిపై అధికారుల వివరణ కోరగా. సాగర్‌కు చేరిన నీటిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నామని చెప్పారు.
సాగర్ ఎడమ కాల్వకు 778 క్యూసెక్కులు, వరద కాల్వకు 400 క్యూసెక్కులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం నీటి విడుదలను ప్రారంభించారు. క్రమంగా పెంచుకుంటూ 5,000 క్యూసెక్కులతో ఎడమ కాల్వకు వానకాలం పంట సాగుకు నీటి విడుదలను కొనసాగించనున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌లోకి వరద వచ్చి చేరే అంచనాను బట్టి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీ టి లభ్యతను బట్టి విడుదల ఉంటుందని పేర్కొన్నారు. వరద కాల్వకు 400 క్యూసెక్కులతో నీటి విడుదలను కొనసాగిస్తామని చెప్పారు.
నాగార్జునసాగర్ డ్యామ్‌ను ఈఎన్సీ అనిల్‌కుమార్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. వరద భారీగా వచ్చి చేరుతున్నందున డ్యామ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు చేపట్టాలని ఆదేశించారు. డ్యాం భద్రతకు ఢోకా లేకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో నీటి నివేదికలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. డ్యామ్ నిర్వహణకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఆంధ్రా ఆధీనంలో ఉన్నందున ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు.