నందికొండ, జూన్ 13 : నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్‌గేట్లకు ప్రతి ఏటా చేపట్టాల్సిన మరమ్మతు పనులను డ్యాం సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యాం క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేశారు. డ్యాం 26 క్రస్ట్ గేట్లను ట్రయల్ రన్ నిర్వహిస్తూ గేట్ల రోప్‌లకు గ్రీసింగ్ పనులు చేపడుతున్నారు. మరో వారం రోజుల్లో డ్యాం క్రస్ట్‌గేట్ల మరమ్మతు పనులు పూర్తికానున్నట్లు సిబ్బంది తెలిపారు.
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడం, శ్రీశైలం ఎగువన ఉన్న రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్‌లోకి నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నది. దీంతో నాగార్జునసాగర్ డ్యాం వార్షిక మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.
ఈ సందర్భంగా డ్యాం ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. డ్యాం 26 క్రస్ట్ గేట్ల మరమ్మతులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. డ్యాం గ్యాలరీలో క్లీనింగ్, లైటింగ్ పనులను చేస్తున్నట్టు తెలిపారు. డ్యాం స్పిల్‌వే పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని, స్పిల్‌వే పనులను చేసేందుకు జూలై చివరి వారం వరకూ అవకాశం ఉన్నదని వెల్లడించారు.