Crime news : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, మూడు, నాలుగు, ఐదేళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు హత్యకు గురయ్యారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. దాంతో అతడే భార్యబిడ్డలను చంపి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి చందన్ పార్క్ (Chandan Park) ఏరియాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
చందన్ పార్క్ ఏరియాలో ముంచన్ కెవాత్ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆజాద్పూర్ మండిలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్థానికులు వారి ఇంటికి వెళ్లి చూసేసరికి.. ముంచన్ భార్య, ముగ్గురు చిన్నారులు రక్తపు మడుగులో విగతజీవులై పడిఉండటం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హంతకుడు పదునైన ఆయుధంతో వారి గొంతు కోసి చంపేసినట్లు గుర్తించారు. బాధితులు నిద్రలో ఉండగానే ఈ దాడి జరిగిందని, వారు ప్రతిఘటించే అవకాశం లేకుండా నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటన జరిగినప్పటి నుంచి ముంచన్ పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ కలహాల కారణంగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించిన అధికారులు, ప్రత్యేక బృందాలతో హంతకుడి కోసం వేట ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి నిందితుడి జాడ కోసం వెతుకుతున్నారు.