కేతేపల్లి, మే 30 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుపై సీమాంధ్ర పాలనలో ఉన్న మాదిరిగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన మూసీ ప్రాజెక్టు అభివృద్ధిలో మళ్లీ వెనుకబడుతోంది. నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడెం నియోజకవర్గాల పరిధిలోని రైతులకు జీవనాధారంగా ఉన్న మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల కాకుండా నిలిపేసి రెండు నెలలు గడుస్తోంది. అయినా ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా యథావిధిగా దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. కుడి కాల్వ తూము షెట్టర్ మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో లీకేజీల ద్వా రా నీరు దిగువకు వెళ్తోంది. షెట్టర్‌ను పైకెత్తిన సందర్భంలో అది కిందకు దిగకుండా అలాగే ఉంటోందని అధికారులు అంటున్నారు.
తాత్కాలికంగా షెట్టర్‌కు మరమ్మతులు చేపట్టినప్పటికీ వారం రోజుల్లోనే మళ్లీ లీకేజీలు ఏర్పడుతున్నాయి. నీటిని నిలిపి వేసిన ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం తక్కువగా ఉన్న సమయంలో 30 నుంచి 50 క్యూసెక్కుల వరకు వృధాగా వెళ్లిన నీరు ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినకొద్దీ వృథాగా పోతోంది. ప్రస్తుతం 200 క్యూసెక్కులకు పైగా నీరు కుడికాల్వ ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. వృథాగా వెళ్తున్న నీటితో బీడు భూములు తడిసిపోతున్నాయి. ప్రస్తుతం ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి నీటితో కళకళలాడుతున్నాయి. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోను నిల్వ చేసి రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపి వానాకాలం సాగుకు నీరందివ్వాలి. ఈ పరిస్థితిని అధికారులు పర్యవేక్షించడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ పాలనలో మారిన రూపురేఖలు
మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో మూసీ ప్రాజెక్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. శిథిలావస్థకు చేరుకున్న ప్రాజెక్టుకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కేసీఆర్ సహకారంతో కోట్ల నిధులు మంజూరు చేయించి ఆయకట్టు ప్రాంత రైతులకు అండగా నిలబడ్డారు.ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగునీటిని అందించడమే ధ్యేయంగా గత ప్రభుత్వం ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది.రూ.19 కోట్లతో ప్రాజెక్టుకు నూతన గేట్లను ఏర్పాటు చేశారు.ఎర్త్డ్యాంపై బీటీ రోడ్డును సైతం నిర్మించారు. నూతన గేట్ల ఏర్పాటుతో ప్రాజెక్టు గేట్ల ద్వారా గాని, కాల్వల షెట్టర్ల ద్వారాగాని నీరు వృధాగా వెళ్లేది కాదు.ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఏమాత్రం వర్షం కురిసినా వచ్చే ఇన్‌ఫ్లోను అంచనా వేస్తూ అధికారులు రిజర్వాయర్‌లో నీటి నిల్వను పెంచేవారు.నూతన రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేవలం యాసంగిలో, అది కూడా ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందించేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన గేట్లు ఏర్పాటు చేసిన తర్వాత 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునేది. దాంతో నాటి నుంచి వానాకాలంలో కూడా రైతులకు సాగునీటిని అందించేవారు.ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో, రిజర్వాయర్ పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40 వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుంది. బీఆర్ఎస్ పాలనలో చివరి ఆయకట్టు రైతులకు సైతం సాగునీరు అందేది.
638.20 అడుగులుగా మూసీ నీటిమట్టం
మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 348.37 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.ప్రస్తుతం కుడి కాల్వకు 200 క్యూసెక్కుల వరకు అవుట్‌ఫ్లో వెళ్తున్నా ప్రాజెక్టు నుంచి ఎలాంటి అవుట్‌ఫ్లో వెళ్లడం లేదని అధికారులు చెప్పడం గమనార్హం. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 638.20 అడుగులు(2.82 టీఎంసీలు) ఉన్నట్లు తెలిపారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసిన సమయంలో షెట్టర్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి నీరు వృధా కాకుండా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. వానాకాలం సీజన్లో ఆశించిన మేర వర్షాలు ఉండవని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీరు వృధా కాకుండా ఉండేందుకు అధికారులు త్వరితగతిన కుడి కాల్వ షెట్టర్‌కు మరమ్మతులు చేపట్టాలి.
-ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతు తుంగతుర్తి, కేతేపల్లి మండలం
రూ.28 లక్షలకు ప్రతిపాదనలు పంపాం
కుడి కాల్వ తూము షెట్టర్ వంగడంతో కిందకు దిగడం లేదు. దాంతో నీరు దిగువకు వృధాగా పోతోంది.ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెరిగినకొద్దీ ఒత్తిడి కారణంగా లీకేజీ ఎక్కువైతోంది. షెట్టర్ మరమ్మతులకు గత రెండు నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. రూ.28 లక్షలతో షెట్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతాం.
-మధు, ప్రాజెక్టు ఏఈఈ