– ప్రచారాల కోసం ట్రాఫిక్ రూల్స్ కు తిలోదకం
– రూ.50 లక్షల ప్రతిపాదనకు మంత్రి చేతుల మీదుగా ఆర్భాటం
– బీఆర్ఎస్ హయాంలో జరిగిన రూ.100 కోట్ల “అభివృద్ధి”కి అడ్డుగా పైలాన్ ఏర్పాటు
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఆగస్టు 05 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాల కోసం పాకులాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. శంకుస్థాపనలు, పైలాన్ల ఏర్పాట్ల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తూ ప్రచారాలకు తెర లేపుతోంది. తమ ప్రచారాలకు అడ్డు వచ్చే ప్రభుత్వ ఆస్తులను కూడా తొలగించి శిలాఫలకాలను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అవగతం అవుతోంది. కొత్తగూడెం నగరంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్ ని తొలగించి ఆ స్థానంలో శిలాఫలకంతో కూడిన దిమ్మను ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.100 కోట్ల బడ్జెట్ తో సెంట్రల్ డివైడర్ లైటింగ్‌లను ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్ పోల్ వెనక పైలాన్ ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అదే పైలాన్ కు అడ్డుగా ట్రాఫిక్ సిగ్నల్ పోల్ ని తొలగించి మరీ కేవలం రూ.50 లక్షలతో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి గోధుమ వాగు వంతెన వరకు ఏర్పాటు చేసే డివైడర్ కోసం అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఖర్చుతో కూడిన హంగు ఆర్భాటాలతో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.
సిగ్నల్ పోల్ ని తొలగించే రోజే కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ ను వివరణ కోరగా కేవలం ఒక్కరోజు కోసం మాత్రమే సిగ్నల్ పోల్ ని తొలగించామని, మళ్లీ వెంటనే అక్కడ పోల్ తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత నెల 19వ తేదీన ఈ పైలాన్ ఏర్పాటు జరిగినప్పటికీ ఇప్పటివరకు తొలగించిన ట్రాఫిక్ సిగ్నల్ పోల్ ని ఏర్పాటు చేయకపోవడం పట్ల పాలకులు, కార్పొరేషన్ అధికారులపై సర్వత్ర కొత్తగూడెం నగరంలో విమర్శలు జల్లు కురుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి ఈ పోల్ పునరుద్ధరించనున్నారో లేదో వేచి చూడాల్సి ఉంది.