సూర్యాపేట టౌన్, డిసెంబర్ 11 : రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. జిల్లాల సందర్శనలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అక్రమ వ్యాపారాలను నిరోధించడానికి పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టంగా పని చేయాలన్నారు. సరిహద్దు వెంట చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం, ఇసుక అక్రమ రవాణా, గుట్కా వ్యాపారం, గంజాయి రవాణా, వినియోగం, జూదం వంటి సమాజానికి హాని కలిగించే వాటి నివారణకు కృషి చేస్తున్నామని చెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అలవాటుగా నేరాలకు పాల్పడ్డ నరసింహారావు, జగదీశ్‌పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని తెలిపారు.
బియ్యం అక్రమ రవాణాతో అనుమానం ఉన్న ఆరుగురిని తీసుకొచ్చి ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేస్తున్నామన్నారు. అక్రమ రవాణాకు సహకరిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి రవాణా, వినియోగం, అమ్మకం చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడంతోపాటు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. సన్న వరికి ప్రభుత్వం బోనస్ ఇస్తున్నందున ఇతర రాష్ర్టాల ధాన్యం రాకుండా చూస్తున్నామని తెలిపారు. సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్పీ, సూర్యాపేట ఇన్చార్జి ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. కోదాడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోదాడ సబ్ డివిజన్‌కు ఎక్కువగా ఆంధ్రా సరిహద్దు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు అధికారులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. అక్రమ వ్యాపారాలు, రవాణాను పటిష్టంగా నిర్మూలిస్తామని తెలిపారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, కోదాడ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, రూరల్ సీఐ రజితారెడ్డి, మునగాల, హుజూర్నగర్ సీఐలు రామకృష్ణారెడ్డి, చరమందరాజు, పట్టణ సీఐ రాము, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.