అనుమతులు ఉండవు.. అడిగేవారు లేరు.. అంతా ఇష్టారాజ్యం! మునుగోడు మండలంలోని చెరువుల్లో రాత్రి పగలూ తేడా లేకుండా పొక్లెయిన్లు మట్టిని తోడేస్తున్నాయి. టిప్పర్లు నాన్ స్టాప్‌గా చక్కర్లు కొడుతున్నాయి. అక్రమారులు నిబంధనలకు విరుద్ధంగా మట్టి దందా చేస్తూ చెరువులను తవ్వేస్తున్నారు. సర్కారు ఖజానాకు గండి కొడుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల పరిరక్షణకు పాటుపాడాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.
– మునుగోడు, మే 19
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి అనుమతి కావాలి. ఆ అనుమతి మేరకు మైనింగ్ శాఖ పన్ను చెల్లించాలి. క్యూబిక్ మీటరుకు 43 రూపాయల చొప్పున చెల్లించాకే మట్టి తవ్వకాలు జరుపాలి. ఇవేమీ లేకుండా అక్రమార్కులు ఇష్టానుసారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మట్టి తోడేస్తున్నారు. అయినా ఆయా శాఖల అధకారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా గోప్యంగా ఉంచాల్సిన వారి పేర్లను బయటకు చెప్తుండడంతో ప్రజలు కూడా మౌనంగా ఉంటున్నారు.
తాజాగా మండల పరిధిలోని సోలిపురం గాంధీసాగర్ చెరువు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న తొమ్మిది వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి స్టేషన్‌కు తరలించారు. వాటి యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఇరుగు రవి తెలిపారు. మునుగోడు మండలంలో జరుగుతున్న మట్టి దందాపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ విభాగాల అధికారులు ఆరా తీసున్నట్లు పైకి చెబుతున్నా, లోలోన మాత్రం వారికి తెలిసే వ్యవహారమంతా సాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లేకపోతే అడ్డూఅదుపు లేకుండా ప్రకృతి సంపదను దోచుకుపోతుంటే ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మునుగోడు మండలంలో ఇప్ప టి వరకు మట్టి తవ్వకం కోసం టిప్పుర్లు, ట్రాక్టర్ల యాజయానులు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని నల్లగొండ మైనింగ్ శాఖ ఏడీ సామ్యూల్ జాకబ్ చెప్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తే గ్రామీణ ప్రాంత రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయని పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
అనుమతులు లేకుండా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్ చేస్తాం. ఇందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకుంటాం. అక్రమార్కులపై క్రిమనల్ కేసు పెడుతాం.
-నేటపట్ల నరేశ్, ఇన్చార్జి తాసీల్దార్, మునుగోడు