సూర్యాపేట, నవంబర్ 06 : రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేట స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చలమల్ల నరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌన దీక్షలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్లు కేటాయించాలని, ఓట్లు బీసీలవైతే రాజ్యాధికారం అగ్ర వర్ణాలకు అవుతుందన్నారు. బీసీ జనాభా గత పది సంవత్సరాల్లో గణనీయంగా పెరిగిందన్నారు. కాగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కల్లో పది శాతం తగ్గించి చూపించిందన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాదని, రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 60 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం, మండల కమిషన్ కోసం మనమంతా ఎలా ఉద్యమించామో అలాగే రిజర్వేషన్లు సాధించుకునేందుకు అంతకంటే ఎక్కువ చైతన్యమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఏ పార్టీ జెండా పట్టుకున్నా బీసీలమంతా ఒక్కటేనని, అన్ని రంగాల్లో బీసీ జనాభా ఎంత ఉందో అంత శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు ఉద్యమిస్తామన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బైరు వెంకన్న గౌడ్, అప్పం శ్రీనివాస్ రావు, నల్లగుంట్ల అయోధ్య, ఆకుల లవకుశ, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, దంతాల రాంబాబు, నరేందర్, కోన మల్లయ్య, తప్పెట్ల శ్రీరాములు, నిద్ర సంపత్, నారబోయిన కిరణ్, ఆయా కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.