– సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం
దామరచర్ల, జూన్ 15 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్లాంట్ లోని స్టేజి 1, 2 యూనిట్లకు సంబంధించి ఆపరేషన్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రిక్ పనులను ఉద్యోగుల కొరతను సాకుగా చూస్తూ రానున్న మూడు సంవత్సరాల కాలానికి గాను ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగించేందుకు వీలుగా టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 12 నుంచి 29 వరకు టెండర్ల గడువు ప్రకటన చేసింది. విద్యుత్ సమస్యతో సతమతమవుతున్న తెలంగాణకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.35 వేల కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రారంభించింది. 80 శాతం పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తిచేసి మొత్తం 4 యూనిట్లను ప్రారంభించగా ఒక్కొక్క యూనిట్ నుండి 800 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్ల ద్వారా 3,200 మెగావాట్ల విద్యుత్ అందించే సామర్థ్యాన్ని సాధించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్లాంటును ప్రైవేటుపరం చేయడంపై సిఐటియు తీవ్రంగా వ్యతిరేకంగా వస్తుందన్నారు.
పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులు నిర్వాసితులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరి ఆందోళనకి సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తోంది. ప్లాంట్ నిర్వహణకు 4,000 మంది సిబ్బంది అవసరం ఉండగా 1,262 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్న అవసరమైన ఉద్యోగాలు నియమించడంలో తాస్తారం అవుతుంది. భూ నిర్వాసితులకు 300 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించింది. స్థానికంగా 2,000 మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు ఇప్పటికీ అమలు చేయలేదు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోగా ప్లాంట్ ను ప్రైవేటికరించే ప్రయత్నాలను ఉప సంహరించుకోవాలని, ఈ విషయంలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి రవి నాయక్, మండల కన్వీనర్ దయానంద్, రైతు సంఘం జిల్లా నాయకుడు వినోద్ నాయక్ పాల్గొన్నారు.