నకిరేకల్, మార్చి 20 : పట్టణంలోని మూసీరోడ్డులో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్‌ను వంద శాతం తీసేస్తామని, చేపలు, కోళ్ల వ్యర్థాలతో పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ‘కాంగ్రెస్ ప్రజాపాలనకు వందరోజులు- ప్రజా నాయకుడికి 100 ప్రశ్నలు’లో భాగంగా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పీపుల్స్ క్వశ్చన్ అవర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విజన్ నకిరేకల్ పేరుతో 200 మందితో అఖిలపక్ష కమిటీని వేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాము లం చేస్తామన్నారు. సొంత నిధులు రూ.20 లక్షలతో క్రైస్తవులకు శ్మశానవాటిక నిర్మాణం చేపడతామన్నారు. తాటికల్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటి యజమానులకు పరిహారం చెల్లించిన తరువాతే రోడ్డు విస్తరణ చేస్తామన్నారు. గంజాయి రహిత నకిరేకల్గా చేయడమే ముందున్న లక్ష్యమన్నారు.
ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధిపై పీపుల్స్ క్వశ్చన్ అవర్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు చామల శ్రీనివాస్, ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్, జెల్ల ముత్తిలింగయ్య, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, సుంకరబోయిన నర్సింహ, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య, కౌన్సిలర్లు గాజుల సుకన్య, కందాల భిక్షంరెడ్డి, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు.