యాదాద్రి భువనగిరి, జూలై 1 (నమస్తే తెలంగాణ)/ యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్‌లోనే అసమ్మ తి, అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కనీసం సమాచారం ఇవ్వకుండానే బోర్డును ఏర్పాటు చేయడంపై ప్రజాప్రతినిధులు ఫైర్ వుతున్నారు. కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా, మరికొందరు అంతర్గతంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియకుండా బోర్డును ఏర్పాటు చేయడంపై రుసరుసలాడుతున్నారు. ఇదే విషయంపై మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్‌లోనే అసంతృప్తి..
ట్రస్టు బోర్డు ఏర్పాటు ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ తెచ్చి పెట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులతో పాటు ఇద్దరు ఎంపీలు, 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే యాదగిరిగుట్ట అభివృద్ధిపై మంగళవారం హైదరాబాద్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. జీవో బయటకు వచ్చే వరకు అసలు బోర్డు సంగతే ఎవరికీ తెలియలేదని తెలుస్తున్నది. జీవో వచ్చాక బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఎవరు అనే చర్చ కాంగ్రెస్‌లోనే నడిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వకుండా బోర్డు ఏర్పాటు చేశారనే ప్రచారం నడుస్తున్నది. దీనిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లాలో నా నియోజకవర్గం ఉం టుంది. యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై కనీసం సమాచారం ఇవ్వలేదు. ఇది ఏకపక్ష నిర్ణయం. అస్సలు కరెక్ట్ కాదు. నన్ను అడిగితే మా నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిగా నియమించుకునేవాడిని.ఇది చాలా దారు ణం. ఇలా ప్రవర్తిస్తే చాలా కష్టం.’ అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బహిరంగంగా ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతున్నారని సమాచారం.
ఉమ్మడి జిల్లా దక్కని చోటు..
యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటులో స్థాని క ప్రజాప్రతినిధులకు గానీ, ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సీనియర్ సిటిజన్స్, గతంలో దేవస్థానంలో సేవలందించిన స్థానికులకుగానీ చోటు దక్కలేదు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులతో పాటు సీనియర్ నాయకులకు సైతం ట్రస్టు బోర్డులో చోటు దక్కలేదు. కనీసం ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు సైతం ట్రస్టు బోర్డులో కనిపించలేదు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, స్థాని క ఎమ్మెల్సీలను మరిచిపోయారు. ఈ ప్రాం తంలో పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న ఎంతో మంది తమకు ట్రస్టు బోర్డులో అవకాశం కల్పిస్తారని భావించారు. వారి ఆశలు అడియాసలయ్యాయి. గతంలో తమ ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించాలని మంత్రి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నారనే ప్రచారం జోరుగా సాగిం ది. అయితే వారి విన్నపాన్ని సైతం పట్టించుకోకుండా సీఎం ట్రస్టు బోర్డులో గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులకు ప్రాధాన్యత కల్పించారు.
గతంలో ఉమ్మడి నల్లగొండకే సముచిత స్థానం
2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయగా స్థానికులకు ప్రాధాన్యతనిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక సభ్యులకు ధర్మకర్త మం డలిలో స్థానం కల్పించారు. దీంతో పాటు హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు సైతం అవకావం ఇచ్చారు. 2010లో ఏర్పాటైన ధర్మకర్త మండలి చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డైరెక్టర్లుగా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, బీబీనగర్‌కు చెందిన గుంటుకింది భాగ్యమ్మ, పోచంపల్లికి చెం దిన దారెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, నల్లగొండకు చెందిన దాసోజు సత్యనారాయణ చారి, సూర్యాపేటకు చెందిన వెంపటి సురేశ్, కోదాడకు చెందిన పగడాల ప్రభాకర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్, కరీంనగర్‌కు చెందిన రాజేందర్ నియమితులయ్యారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో అప్పటి సీఎం కేసీఆర్ వైటీడీఏను ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటు కాలేదు. తాజాగా రేవంత్‌రెడ్డి ధర్మకర్తల మండలి పేరుకు బ దులు యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారు.
వ్యాపార, సినీ పరిశ్రమ చేతిలోకి బోర్డు..
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ సుమారు 22 సార్లు యాదగిరిగుట్టను సందర్శించి రూ.1300 కోట్లతో పూర్తి కృష్ణశిలతో దేశమే గర్వపడేలా మహాద్భుతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన అనంతరం ఆలయాన్ని వారాంతపు సెలవుల్లో లక్షకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో విడుదల చేశారు. చైర్మన్‌గా ఎంఎస్ఎన్ కంపెనీ చైర్మన్, ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డితోపాటు సభ్యులను నియమించారు. అయితే కోట్లాది మంది భక్తుల ఇలవేల్పుగా ఉన్న యాదగిరిగుట్ట నూతన పాలకమండలి ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్నది. స్వామివారి ఆలయ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్రస్టు బోర్డును సైతం వ్యాపార సంస్థల ప్రతినిధులు, సినీ పరిశ్రమ చేతిలో పెట్టారన్న చర్చ సాగుతున్నది. స్వామివారి ఆలయ అభివృద్ధికి సహకరించిన స్థానికులకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులో ఆలయ అభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో భౌగోళిక, సామాజిక పరిస్థితులు, స్వామివారి స్థల పురాణం, ఆధ్యాత్మిక సేవలు నిర్వహించే స్థానికులకు చోటు కల్పించకపోవడంతో ఆలయ అభివృద్ధి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.