గుర్రంపోడు, ఏప్రిల్ 1 : తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోతున్నదన్నారు. దశాబ్దాలుగా పాలించిన ఆ పార్టీ చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకూ కావాలని దేశమంతా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నదని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు గుర్తుకొస్తారన్నారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని పేర్కొన్నారు.
ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ఆంజనేయస్వామి గుడి లేని గ్రామం లేదు.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు గడపగడపకూ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశం మొత్తం కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలన్నారు. నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో కోటిన్నర రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. వచ్చే ఐదేండ్లలో మట్టి రోడ్డు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో వారానికో రోజు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటానని అన్నారు.
పండుగలా వ్యవసాయం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో దండుగలా ఉన్న వ్యవసాయం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పండుగలా మారిందన్నారు. ఉద్యమాల బీఆర్ఎస్ పార్టీ రాష్ర్టాన్ని అభివృద్ధ్ది, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తుండడంతో దేశమంతా ఇటువైపే చూస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, శాంతిభద్రతల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు.
మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాత్రి బస
ఎమ్మెల్యే నోముల భగత్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి బస చేసి.. ఉదయం గ్రామంలో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యేకు కొప్పోలు గ్రామంలో డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీ ధనుంజయ, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న, నాయకులు జలగం సుదర్శన్‌రావు, దోటి చంద్రమౌళి, నాగరాజు, ముత్యాలు, శ్రీవాణి, రామచంద్రం, కరుణాకర్‌రావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అంటేనే అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే అభివృద్ధి.. అభివృద్ధి అంటేనే కేసీఆర్. గత ప్రభుత్వాలు ప్రజల గురించి పట్టించుకునేవాళ్లు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గతంలో కరంటు కోసం ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు 24 గంటలు ఉంటున్నది. పండించిన పంటను మద్దతు ధర పెట్టి కొంటున్నరు.
– దాము యాలాద్రి, చామలేడు, గుర్రంపోడు మండలం
రైతును రాజు చేసిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తోపాటు ఏఎమ్మార్పీ కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అధిక దిగుబడులు రావడంతోపాటు మద్దతు ధర అందిస్తుండడంతో రైతు రాజులా మారాడు. గతంలో కరంటు రాక, నీళ్లు లేక భూములు బీడుగా మారాయి. రైతులు వ్యవసాయం వదిలి పట్నాలకు పనుల కోసం పోయేది. ఇప్పుడు రైతులు పట్నాల నుంచి గ్రామాలకు తిరిగి వచ్చి తమ భూముల్లో బంగారం పండిస్తున్నారు.
– జాల మల్లేశం, పోచంపల్లి, గుర్రంపోడు మండలం