యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లుచ్చా.. లఫంగి రాజకీయాలు బంద్ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ధ్వజమెత్తారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయ వ్యభిచారం చేయాలని విమర్శించారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడి యా సమావేశంలో మాట్లాడారు.
ఐలయ్య.. కాం గ్రెస్ పార్టీని బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎవరి ఆదేశాల మేరకు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారని, పార్టీ నీ జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి వారి బంధుత్వం కోసం కాంగ్రెస్‌ను బొందపెట్టొద్దని మండిపడ్డారు. సంజీవ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి జంగిలి, లఫంగ పనులు చేయొద్దని, రాజకీయ వ్యభిచారం మానుకోవాలని సూచించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో కొం దరు తమ పార్టీ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఓడితే నాయకులు, కార్యకర్తలు మీకు బుద్ధి చెపుతారని విమర్శించారు. ఐలయ్య, సంజీవ్‌రెడ్డిపై సీఎంకు, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేసి, ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్ మధ్యలోనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఫోన్ చేయగా..విప్, జిల్లా అధ్యక్షుడు, చైర్మన్లపై ఫిర్యాదు చేశారు.