కొండమల్లేపల్లి, మార్చి 19 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు రేవంత్‌రెడ్డి పాలనను ఛీ కొడుతున్నారని మాజీ మంత్రి, సుర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు భరోసా, రుణమాఫీ చేస్తామని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేయడం లేదన్నారు. రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు భరోసా మొక్కుబడి ఇస్తున్నారని, ఉచిత విద్యుత్ 10 గంటలు కూడా వస్తలేదని, అది కూడా లోఓల్టేజీతో వస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ కూలితే దాన్ని రిపేర్ చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోననే దుర్బుద్ధితో రేవంత్‌రెడ్డి సాగునీళ్లు ఇవ్వకుండా పొలాలు ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తగ్గాయని, ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై పెత్తనం చెలాయిస్తున్నాడని అన్నారు. వాటాకు మించి ఆంధ్రాకు నీళ్లు తీసుకు పోతున్నా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు అడిగే దమ్ములేదని విమర్శించారు. పరిస్థితి ఇట్లనే ఉంటే రేపు హైదరాబాద్‌కు కూడా తాగునీళ్లు దొరకని పరిస్థితి వస్తుందని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు చరిత్రలో వరుసగా 17 పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.
ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి, మరోవైపు చాలీచాలని కరెంటుతో పంటలకు నీళ్లందక ఎండిపోతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండి రైతులు రోడెక్కి అందోళనలు చేస్తున్నారని అన్నారు. సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్, బీఆర్ఎస్ కొండమల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, రైతు బంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, యువజన అధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, రావుల వెంకటయ్య, పెద్దిశెట్టి సత్యం, వరికుప్పల పాండు, తోటపల్లి శ్రీను, శేఖర్ యాదవ్, ఎస్కే బషీర్, దాచేపల్లి నరేందర్, తోటపల్లి వెంకటేశ్వర్లు, వెంకటయ్య, పేట రమేశ్ ఉన్నారు.