గుర్రంపోడ్, ఏప్రిల్ 19 : రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గాలి జంగయ్య ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పెద్ద మొనగాడని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే రెండున్నరేండ్లలోనే మొనగాడు కాదు.. పెద్ద మోసగాడని అర్థమైందన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తానేదార్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు బొల్లు దశరథరెడ్డిని ధాన్యం ఎలా కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. క్వింటాకు 5 కేజీలు తరుగు తీస్తున్నారని, రైసు మిల్లర్లు క్వింటాకు 2 కిలోలు తరుగు తీస్తున్నారని, మొత్తం మీద క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పారు. దీంతో హరీశ్‌రావు స్పందిస్తూ సీఎం, మం త్రులు అందరూ గాలి మోటార్లకే పరిమితమయ్యారే తప్ప జనం సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.
రైతు సమస్యపై స్పందించని ఉత్తమ్..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన జిల్లాలోని రైతులకు ఇంత అన్యాయం జరుగుంతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టే పనిమీద రేవంత్ ఇప్పటి వరకు 70 సార్లు ఢిల్లీ వెళ్లాడన్నారు. కప్పం కట్టే పని మీద ఉన్న సోయి తెలంగాణ ప్రజల మీద లేకపోవడం విచారకరమన్నారు.
జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.20 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టిందన్నారు. రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయలేదన్నారు. వానాకాలం బొనస్ కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 100 మీటర్లు కూడా పూర్తి చేయలేదన్నారు. టన్నెల్లో చనిపోయిన వారి శవాలను కూడా తీయలేని దద్దమ్మ ప్రభుత్వమన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హమీని కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.

దేవుళ్లను కూడా మోసగించిన రేవంత్..
ఎన్నికల ముందు 101 దేవుళ్ల మీద ప్రమాణాలు చేసిన రేవంత్ రెడ్డి, హమీలు అమలు చేయకుండా దేవుళ్లను కూడా మోసం చేశాడన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకుల విలీనం వలన రైతులు నష్టపోతే వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. రెండు లక్షలకు పైగా రుణం ఉన్న రైతులను పైసలు మీరు కట్టండి.. రూ.2 లక్షల రుణ మాఫీ నేను చేస్తానన్నడు. ఆ మాటలు నమ్మి డబ్బు కట్టిన రైతులు, నేటి వరకు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 40 శాతం మాత్రమే రుణ మాఫీ జరిగిందన్నారు. రైతుల పంటల బీమాను తొలగించారన్నారు. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా చెరువుల రూపు రేఖలే మార్చారన్నారు.
నాగార్జునసాగర్ లోలెవ ల్ కెనాల్‌ను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు నీరందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ల మీద ఉన్న సోయి, రైతుల మీద లేదన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేన ని, రైతులు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ట్రైకార్ మాజీ అధ్యక్షుడు రాంచంద్ర నాయక్, జిల్లా మాజీ అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ (అమెరికా) కార్యదర్శి నాగులవంచ నర్సింహారావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు, రామగిరి చంద్రశేఖర్ రావు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.