సూర్యాపేట, మార్చి 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాల పునాదులపై రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చారని, అయితే ఏడాదిన్నర పాలన పూర్తి కావొస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ మూర్ఖపు ఆలోచనలతోనే నడుస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పద్ధతి, వాడుతున్న భాషే ఆయనను బొందపెడుతాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలకు కాదని పేర్కొన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడమే కాకుండా పచ్చి అబద్ధాలు ఆడారని అన్నారు.
రేవంత్ సర్కార్ చిన్న సాకుతో కాళేశ్వరాన్ని పండబెట్టి గత రెండు సీజన్లలో రైతుల పంటలను ఎండబెట్టిందని, ప్రాజెక్ట్‌ను తమకు అప్పగిస్తే కేవలం మూడు రోజుల్లో నీటిని ఇస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని, కేసీఆర్‌పై కోపంతో పంటలను ఎండబెట్టడం దుర్మార్గమన్నారు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు కూడా నీళ్లివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని తేటతెల్లం అవుతుందని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నారని, అయినా నడిపించే సోయి ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని అన్నారు. ఉమ్మడి ఏపీలో మాదిరిగానే రాష్ట్రంలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, రైతులు కన్నీటితో ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారని పేర్కొన్నారు.
పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఇవ్వలేదని.. ఇలా ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు పంటలనే కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యం కాదన్నారు. ఇంకా మూడున్నరేళ్లు అధికారంలో ఉంటారని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు భయపడకుండా ఎండగడుతున్నారని అన్నారు. ఎక్కడా నీ గురించి నీవు ఒక్కరోజు కూడా మాట్లాడుకోవడం లేదు కానీ కేసీఆర్ గురించి మాట్లాడనిదే నీకు పూట గడవడం లేదని రేవంత్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు తిరుగబడితే ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో పక్క దేశాలను చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. ఇప్పటికైనా పద్ధతి, భాష మార్చుకొని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం ఒక్కతడికి నీళ్లిచ్చినా పెట్టుబడి వస్తుంది..
పంటల సాగుకు ముందే నీళ్లివ్వమంటే రైతుల పొలాలు వేసుకోరని, కానీ నాడు ఇస్తామని చెప్పి నేడు నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు వేలాది ఎకరాలు నష్టపోయారని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఒక్క తడికి నీళ్లు ఇస్తే కనీసం పెట్టుబడి ఖర్చు అయినా తిరిగి వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సీజన్లో పంటలను సాగు చేసేందుకు, కాళేశ్వరం కొనసాగింపునకు మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రైతులు మేల్కొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.