దేవరకొండ రూరల్ : సామాజికంగా ,ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. దేవరకొండలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భారంగా మారాయన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యాన్ని కోల్పోకూడదన్నదే నా లక్ష్యం అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో దోపిడికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అర్హులకే ఇండ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
అనంతరం పెండ్లిపాకల రిజర్వాయర్ ముంపు (పత్య తండా) రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు అయిన 30మందికి నష్టపరిహారం చెక్కులను అందజేశారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.