ఆంధ్రప్రదేశ్ నుంచి వరిధాన్యం భారీగా జిల్లాకు చేరుకుంటున్నది. మిర్యాలగూడలోని మిల్లులకు పెద్ద ఎత్తున రావడంతో మన జిల్లా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతున్నది. దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీ నుంచి ధాన్యం రాకుండా పోలీసులు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దాంతో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, మిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు తీసుకున్న చర్యలతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– నేరేడుచర్ల/మిర్యాలగూడ రూరల్
నేరేడుచర్ల/మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 9 : ఆంధ్రా రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న ధాన్యం లారీలను మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి టోల్గేట్ వద్ద, మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప చెక్‌పోస్ట్ వద్ద వాటిని నిలిపివేశారు. చిల్లేపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం సుమారు 100కి పైగా ధాన్యం లారీలను నిలిపివేశారు. కేవలం స్థ్ధానిక రైతుల ధాన్యం ట్రాక్టర్లకు మాత్రమే అనుమతించారు. చిల్లేపల్లి టోల్గేట్ వద్ద మిర్యాలగూడ పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే లారీలను నిలిపివేస్తున్నారు. అయితే రోడ్డు వెంట లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానిక రైతులు ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే కొనుగోలు చేస్తుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆల్లగడప చెక్‌పోస్ట్ వద్ద..
మండలంలోని ఆల్లగడప చెక్ పోస్ట్ వద్ద మిర్యాలగూడ రూరల్ పోలీసులు సుమారు 150 ధాన్యం లారీలను నిలిపివేశారు. దాంతో చెక్ పోస్టు నుంచి చిల్లెపల్లి మూసీ బ్రిడ్జి వరకు భారీగా ధాన్యం లారీలు నిలిచి పోయాయి. ధాన్యం కోసిన వెంటనే లారీల్లో తీసుకు వచ్చామని, ఆలస్యమైతే ధాన్యం చెడిపోతాయని వాటి ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒక్క సారికి అనుమతించాలని, ఇక నుంచి తీసుకు రామని హామీ ఇవ్వడంతో చెక్‌పోస్ట్ సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతించారు.
స్థానిక రైతుల ఆందోళన మేరకే..
ఇతర రాష్ర్టాల నుంచి మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు ధాన్యం వస్తుండడంతో మిల్లర్లు ధాన్యం ధరను తగ్గిస్తున్నారు. దాంతో తమకు గిట్టుబాటు ధర రావడం లేదని స్థానిక రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కోదాడు, వాడపల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ, వాడపల్లి సరిహద్దుల్లో నుంచి కాకుండా మట్టపల్లి వద్ద నుంచి అడ్డదారిలో భారీగా ధాన్యం లారీలు వస్తున్న విషయం తెలుసుకొన్న అధికారులు మిర్యాలగూడ మండలం ఆల్లగడప టోల్ ప్లాజా వద్ద కూడా చెక్ పోస్టును ఏర్పాటు చేశారు.