తిరుమలగిరి, జూన్ 29 : తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు చెరో రూ.10 కోట్ల చొప్పున 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం తిరుమలగిరి పట్టణంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఈ మేరకు నిధులను కోరగా మంత్రి కేటీఆర్ తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గం మొత్తం దాదాపు అన్ని గ్రామాలకు రహదారులు నిర్మించామని అయితే మరికొన్ని గ్రామాలకు రోడ్లు కావాలని కోరగా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మంజూరు చేయిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు ప్రత్యేకంగా తుంగతుర్తి నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు వచ్చాయని, అభివృద్ధి కోసం ఎంకా ఎన్ని కోట్లు అయినా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తిరుమలగిరికి పైలెట్ ప్రాజెక్ట్ క్రింద దళిత బంధు 2,300 మందికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. 2014కు ముందు మన పరిస్థితి ఇప్పుడు మన పరిస్థితిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ ఎవరూ డబ్బులు ఇచ్చినా జేబులో పెట్టుకుని ఓటు మాత్రం కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ కారు గుర్తుకే వేయాలన్నారు. కిశోర్‌ను ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ 40 వేల మేజార్టీతో గెలిపించి తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
రూ.3 కోట్లతో ఆడిటోరియం, 2 కోట్లతో డంపింగ్ యార్డు, 3 కోట్లతో సీసీ రోడ్లు, 5 కోట్లతో సీసీ డ్రైన్లు, కల్వర్టులు, 2 కోట్లతో బతుకమ్మ ఘాట్ కమ్యూనిటీ హాల్, 2 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు, 5 కోట్లతో మున్సిపల్ కార్యాలయ నిర్మాణం, 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణంతో పాటు రూ.30 కోట్లతో మున్సిపల్ పరిధిలో మంచినీటి ట్యాంకులు, పైపులైన్లు నిర్మాణ పనులకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు.
తిరుమలగిరిలో భారీ ర్యాలీ
తిరుమలగిరి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రగతి నివేదన సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నేతృత్వంలో దాదాపు 10 వేలకు పైనే మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇద్దరు మంత్రులు పట్టణానికి చేరుకోగానే స్థానిక వినాయక దేవాలయం వద్ద ఎమ్మెలే గాదరి కిశోర్‌కుమార్‌తో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగ తం పలికారు. ప్రధాన వీధుల మీదుగా సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర డప్పులు, కోలాటాలు, బీఆర్ఎస్ జెండాలతో ర్యాలీ కొనసాగింది. సభకు ముందు రూ.52 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు.
కిటకిటలాడిన సభా ప్రాంగణం..
తుంగతుర్తి ప్రగతి నివేదన సభకు భారీ ఎత్తున జనం తరలిరావడంతో సభా ప్రాంగణం కిటకిడలాడింది. సూర్యాపేట రోడ్డులో ఉన్న స్థలంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నేతృత్వంలో సభను ఏర్పాటు చేయగా నియోజకర్గవ్యాప్తంగా లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, బైక్‌లపై గులాబీ జెండాలు ధరించి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత 30 నుంచి 40 వేల మంది వస్తారని భావించి తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అయితే నియోజకర్గానికి గోదావరి జలాలతో పాటు దళిత బంధు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పార్టీ కేడర్ పెద్ద ఎత్తున రావడంతో 50 వేలకు పైనే మందితో సభా ప్రాంగణం కిక్కిరిసింది. సభకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళాకారుల బృందాలు పాటలు పాడుతుండగా మహిళలతో పాటు యువత కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేశారు. సభలో జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జా దీపికాయుగేంధర్‌రావు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు కంచర్ల రామకృష్ణారెడ్డి, సోమ భరత్‌కుమార్, మదర్ డెయిరీ చైర్మన్ శ్రీకర్‌రెడ్డి పాల్గొన్నారు.
గాయకుడు సాయిచంద్‌కు నివాళి..
గుండెపోటుతో మృతిచెందిన ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్‌కు ప్రగతి నివేదన సభ ఘనంగా నివాళులర్పించింది. నేతలు సభా ప్రాంగణంపైకి చేరుకునే సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాయిచంద్ చిత్రపటానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమయ్యాక సాయిచంద్ మృతికి సంతాపంగా నేతలతో పాటు సభికులంతా నిమిషం పాటు మౌనం పాటించారు. వాస్తవంగా గురువారం ప్రగతి నివేదన సభలో సాయిచంద్ నేతృత్వంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగాల్సి ఉన్నది. కానీ ఆయన హఠాణ్మరణంతో సంతాపం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సభకు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధి ప్రదాతను తిడుతామంటే ఊరుకుందామా?
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒక కాంగ్రెస్ ఆయన కేసీఆర్‌ను దించాలి అని అంటడు, బీజేపీ అయన కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని అంటడు, అసలు ఆ మాట ఎందుకు వస్తుం దో వాళ్లు చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తుంగతుర్తిలో కేవలం 36,491 ఎకరాల ఆయకట్టు ఉండగా సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత 1,41,0057 ఎకరాలకు నీరు అందుతున్నదని, అందుకే కేసీఆర్‌ను దించాలా ? లేక జైళ్లో పెట్టాలా ? అని మంత్రి ప్రశ్నించారు. పూర్వ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ వచ్చి మనుషులు జీవచ్ఛవాలుగా మారిపోతుంటే చూస్తూ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇవాళ వచ్చి కేసీఆర్‌ను తిడుతామంటే ఊరుకుందామా? అని ప్రశ్నించారు. ఆయకట్టులో నాడు 76 వేల మెట్రి క్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే నేడు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తుంగతుర్తి నియోజకవర్గంలో పెరిగిందని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ 68 కిలోమీటర్ల మేర తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలకు జన హారతి పేరిట లక్ష మంది రైతులతో కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలుపడాన్ని మంత్రి గుర్తు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాకముందు నాగారం, ఫణిగిరి, జాజిరెడ్డిగూడెం ఎక్కడైనా 2014కు ముం దు ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే కరంట్ పరిస్థితి ఎలా ఉండేదని, అర్ధగంట కరెంట్ ఇవ్వమని బతిలాడేటోళ్లమని, ఇవ్వాళ ఆ పరిస్థితి ఉందా అని కేటీఆర్ అడిగారు. పక్కనే ఉన్న యాదగిరిగుట్టను ఎవరూ పట్టించుకోలేదని, నేడు కేసీఆర్ తిరుమలకు దీటుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
‘ఇటీవల ఓ కాంగ్రెస్ నేత పాదయాత్ర చేస్తున్నా అని ముందుకొచ్చిండు… తెలిసో, తెలియకో.. చదువుకొనో, చదువు రాకనో ఒక మాట మాట్లాడిండు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏం చేసిండు, మంత్రి ఏం చేసిండు. నల్లగొండ జిల్లాకు నీళ్లు రాలేదు. అందుకే క్షమాపణ చెప్పాలని అడిగిండు. మాకు నిజాన్ని ఒప్పుకొనే దమ్మూ ధైర్యం ఉంది, మా తప్పయితే మేం మా ఉమ్మడి జిల్లా 12 మంది ఎమ్మెల్యేలం కలిసి ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాస్తాం. మా లెక్కలు నిజమని తేలితే మీరంతా ముక్కు నేలకు రాస్తారా?’ అని విపక్ష నాయకులకు రా్రష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. తిరుమలగిరిలో జరిగిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరును ఎండగడుతూ విమర్శలను తిప్పికొట్టారు. ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు.. లెక్కలు తీద్దాం, మీరు అధికారంలో ఉన్న నాడు ఉన్న అధికారులే నేడూ ఉన్నారని, తుంగతుర్తి నియోజకవర్గంలో నాడు ఎన్ని ఎకరాల భూమి సాగైంది? సూర్యాపేట జిల్లాలో ఎంత భూమి సాగైంది? ఇప్పుడెంత సాగవుతున్నది. మొత్తంమీద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంత సాగయిందో లెక్కలు తీద్దామన్నారు. ఆ లెక్కలను బట్టి మీరేం చేయాలో మేం ఏం చేయాలో చేద్దాం. 2014 వరకు మీ రాజ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలు కూడా సాగు కాలేదు, ఏ ఒక్క సంవత్సరం కూడా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించలేదు.
నేడు సీఎం కేసీఆర్ చొరవతో ఈ జిల్లాకు వచ్చిన కృష్ణా, గోదావరి జలాలతో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వరుసగా నాలుగేండ్లు అందించి దేశానికి అన్నపూర్ణగా నల్లగొండ జిల్లా నిలిచింది. ఇది నిజం కాదా? నిజం కాదు అంటే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇది నిజమే అని తేలితే నల్లగొండ కాదు తుంగతుర్తి నుంచి ఢిల్లీ దాకా ఆ పార్టీ నేతలు ముక్కు నేలకు రాయాలన్నారు. కేసీఆర్ సైనికులుగా ఇది మా చాలెంజ్. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ సీఎం అయ్యాకే అభివృద్ధి జరిగింది. మీరు పెంచి పోషించిన పాప ఫలితమైన ఫ్లోరిన్‌ను ఆరేండ్లలో మాయం చేసింది సీఎం కేసీఆర్. కేసీఆర్ రాక ముందు ఆకలి, దారిద్య్రాలతో కూనరిల్లింది ఈ జిల్లా. కాకతీయుల కాలం కంటే ముందు నుంచే వ్యవసాయంలో అద్భుతంగా ఉన్న జిల్లా మీకు ఓట్లు వేసిన పాపానికి కరువు బారిన పడి నాశనమైందని దుయ్యబట్టారు. కరువు బారిన పడిన తుంగతుర్తి, సూర్యాపేటలో కేవలం కొట్లాటలతో రక్తాలు పారించి ఊరికి ఐదు సమాధులు ఇచ్చారు తప్పా, ఐదు రూపాయల పని చేయలేదని విమర్శించారు. ఇవ్వాల సీఎం కేసీఆర్ పుణ్యామని ఈ జిల్లా రైతాంగం ఇంత అన్నం తింటుంది.
జిల్లా నుంచి ఫ్లోరిన్ పారిపోయింది. నేడు మూలకు పడిన ఓ పార్టీ ముసలోళ్లు లేచి ఏదో చేస్తామని వస్తున్నారు, వారితో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో కూసున్నోడు మాట్లాడుతుండు.. అది చెప్పాలి ఇది చెప్పాలని! నిజమే ఇక్కడ నుంచి చూస్తే ఎల్బీనగర్లో ఏడాది కింద ఏముండే ఇప్పుడేముండే. గతంలో హైదరాబాద్‌కు పోతే ఎల్బీనగర్ గుర్తొస్తే ఏడుపొచ్చేది. నేడు ఎల్బీనగర్ వచ్చేది తెలిసేలోపే వెళ్లిపోతున్నాం. మంత్రి కేటీఆర్ అంటే ఏమిటో ఎల్బీనగర్ను చూస్తే అర్థమవుతుందన్నారు. కేటీఆర్ గురించి మాట్లాడేటోళ్లు ఒక్కరికైనా భారతదేశానికి ఐటీ శాఖ మంత్రి ఎవరో తెలుసా? దేశానికి పురపాలక శాఖ మంత్రి ఎవరో తెలుసా? మీకే కాదు అంత చదువుకున్న అమెరికాలో కూడా తెలియదు. కేటీఆర్ దేశానికి ఐటీ, ఇండస్ట్రియల్, పురపాలక శాఖ మంత్రి అని అనుకుంటున్నరు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని తెస్తే, తెలంగాణను భారతదేశానికి కేసీఆర్ పరిచయం చేస్తే, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిండు కేటీఆర్. దేశానికి దిక్సూచి కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఎవరూ ఊహించని రీతిన అభివృద్ధి : ఎమ్మెల్యే కిశోర్‌కుమార్
కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యమ సమయంలో తనపై దాదాపు 182 కేసులు పెట్టినా భయపడలేదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. కేసీఆర్ అవకాశమిస్తే తుంగతుర్తి ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తొమ్మిదేండ్ల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించని రీతిలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.6,500 కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. గతంలో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తుండగా ప్రస్తుతం 3 లక్షల 90 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందంటే అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చూడాలన్నారు. కక్ష్యలు, కార్పణ్యాలతో రక్తపుటేరులు పారిన తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో కాళేశ్వరం జలాలు పారి ఎటు చూసినా సస్యశ్యామలంగా కనిపిస్తున్నదన్నారు. గోదావరిపై కాళేశ్వరం అనే అనకట్ట కడితే సుందిళ్ల, యల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నందిమేడారం, మిడ్ మనేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, లోయర్‌మానేరు నుంచి కేఎంసీ ప్రాజెక్ట్, మైలారం నుంచి బయ్యన్నవాగుకు వస్తే తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేటలో గోదావరి జలాలతో సీఎం కేసీఆర్ పాదాలను కడిగిందన్నారు.
36 వేల ఎకరాలు ఎక్కడా? లక్షా 41వేల ఎకరాలు ఎక్కడా? ఇది ఇవాళ తుంగతుర్తిలో సాధించిన ప్రగతి అన్నారు. కాగా 93,393 మందికి రైతు బంధు, 1,100ల కుటుంబాలకు రైతు బీమా, 1,100 మంది ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మి, 9 వేల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. 230 కోట్లు తిరుమలగిరికి దళిత బందు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, తండాలను గ్రామ పంచాయతీలు చేసినా, రిజర్వేషన్ ఇచ్చినా కేసీఆర్‌కే సాధ్యమైనదన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్‌ను తీసుకొచ్చింది దాదాపు రూ.60 కోట్ల అభివృద్ధి పనుల కార్యక్రమాలకు శంకుస్థాపనలకన్నారు. అలాగే రూ.44 కోట్లతో వంద పడకల ఆస్పత్రి మంజూరు కాగా త్వరలోనే మంత్రి హరీశ్‌రావుతో శంకుస్థాపన చేసుకుందామని చెప్పారు. ఇప్పుడున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, పునరావృతం కావాలన్నా, అవన్నీ స్థిరీకరించబడాలన్నా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలబెట్టాలంటే తుంగతుర్తి గడ్డపై మూడోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నాయకులను చీల్చి చెండాడే నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్న తరుణంలో మనమంతా అండగా ఉండాలని పేర్కొన్నారు.