నార్కట్‌పల్లి, జూన్ 14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ఆర్
అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతు ఇంట్లో పుట్టిన తాను ఏడో తరగతి వరకు ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు ఎదుగవచ్చునని చెప్పారు.
వచ్చే మూడు నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రారంభిస్తామని తెలిపారు.
నార్కట్‌పల్లి డిపోను పునరుద్ధరించడం కోసం 20 బస్సులు తెప్పిస్తామన్నారు. త్వరలో ప్రభుత్వం 13వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును సందర్శించారు. రూ. 40 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నామని, ఆరు నెలల్లో మూసీ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి రానున్న మూడున్నర సంవత్సరాల్లో మూసీని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందనా దీప్తి, జిల్లా విద్యాధికారి భిక్షపతి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.