‘కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. ఏఐసీసీ రహస్య ఎజెండానే బుడ్డర్ఖాన్ నోటి నుంచి బహిర్గతమైంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై గురువారం హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపురం రైతువేదికలో జరిగిన రైతుల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదని స్పష్టం చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే ఇస్తుండడాన్ని గుర్తుచేశారు. వ్యవసాయానికి 3 నుంచి 8 గంటల విద్యుత్ సరఫరా అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలిపారు.
అన్నం పెట్టే రైతులకు సున్నం కొట్టే కుట్రలకు కాంగ్రెస్ తెర లేపిందని, బూతులతో బుడ్డర్ ఖాన్ మాట్లాడిన మాటలను కప్పి పుచ్చుకుంటూ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరాలో కోతలు, ఫించన్‌ను 200 రూపాయలకు కుదించడం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ఎత్తివేత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రూపొందించుకున్న ఎజెండాలోనివేనని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం నిర్విరామంగా కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. మరోవైపు దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ నియోజకవర్గాల్లో జరిగిన రైతు సమావేశాల్లో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. వర్షంలోనూ రైతులు పెద్దసంఖ్యలో హాజరై కాంగ్రెస్ కుట్రలను ఖండించారు.
నేరేడుచర్ల, జూలై 20 : ‘కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడ్డరు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ రైతులను ఆగం చేసేందుకే కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కోతలు.. వాతలే తప్ప ఏమీ ఉండదు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ గురువారం హుజూర్‌నగర్‌లోని శ్రీనివాసపురం రైతు వేదికలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు వ్యవసాయానికి పెద్ద పీట వేసి నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు కరెంటు కోసం కష్టాలు పడ్డారని తెలిపారు. 70 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతుల కోసం ఏం మంచి పనులు చేశారో ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరారు. అబద్ధ్దాలతో దొరికిపోయిన దొంగలు ఇప్పుడు సరి చేసుకోవడానికి కిందా మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యవసాయం గురించి కనీస అవగాహన కూడా లేదని, రైతే రాజు అని నిజం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం నిత్యం ఆలోచించి వారి అభివృద్ధికి పాటుపడుతున్నది సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమికి రూ.లక్ష ఉండేదని, అదే నేడు లక్షల నుంచి కోట్లకు పెరిగిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండేవని, వ్యవసాయానికి 9గంటలు ఇస్తున్నామని చెప్పి మూడు గంటలు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. లోవోల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, దాంతో రైతులపై ఆర్థికంగా భారం పడేదని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్‌ఘడ్‌లో 40వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అక్కడి రైతులకు 24గంటల కరెంటు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నదన్నారు. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులను కాల్చి చంపితే.. నేడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు రైతులను మోసం చేసే విధంగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో గత్యంతరం లేకే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది లేదని పేర్కొన్నారు. కేంద్రంలోని ఏఐసీసీ నాయకులు ఒకటి మాట్లాడుతుంటే.. రాష్ట్ర నాయకులు మరొకటి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి అడిగిన వాటికి సమాధానం చెప్పలేక బూతు పురాణం మొదలు పెడుతాడని, అది నాయకుడి లక్షణం కాదని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు ఉండదని, ఎరువుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలు పండించేలా ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? ఆలోచించాలని రైతులకు సూచించారు. నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Nalgonda3
వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగ అంటే.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నదని, నిరంతరం రైతు శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ర్టాల్లో కొన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఉంచి గెలుపొందుతున్నాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఓ తుగ్లక్ అని, ఆయన మాటల్లోనే కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుందని విమర్శించారు. వారి మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయడం చేతగాదు కానీ.. ఇక్కడ అవి ఇస్తాం.. ఇవి చేస్తామని గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ పత్తిపాటి రమ్య, పీఏసీఎస్ చైర్మన్ అందెం శౌరిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మూడెం గోపిరెడ్డి, నాయకులు దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కడియం వెంకట్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మిర్యాలగూడ రూరల్, జూలై 30 : మండలంలోని కొత్తగూడెం రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే భాస్కర్‌రావు రైతులతో కలిసి గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖబడ్ద్దార్ కాంగ్రెస్.. రైతులతో పెట్టుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. గత కాంగ్రెస్ పాలనలో 9 గంటల కరెంటు ఇస్తే పొలాలు ఎండిపోతుంటే.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శాసనసభలో ఎండిన వరి కంకులను అసెంబ్లీలో ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. అది మరిచిపోయి వ్యవసాయానికి 3 గంటలు చాలని రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆయన తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ‘పవర్’ హాలిడే ఇవ్వాలి
అనంతగిరి, జూలై 20 : రైతు కుటుంబాలను చీకట్లోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ‘పవర్’ హాలిడే ఇవ్వాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటిమయం అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడితే.. రైతులకు నిరంతర విద్యుత్, రైతుబంధు అవసరం లేదని నేడు కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు. రైతు సంక్షేమ పథకాలను ఆపాలన్నదే కాంగ్రెస్ ఎజెండా అని, కేంద్రం పెద్దల మనస్సులో ఉన్న భావాలను రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు బయట పెడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అందిస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు కన్ను కుట్టిందన్నారు. దేశ రాజధాని నడిబొడ్డున రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడిపించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రైతులు చీకట్లో పడ్డ కష్టాలను మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న నాణ్యమైన విద్యుత్ ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. పుష్కలంగా సాగు నీరు, నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు అందజేయడంతోపాటు పంటలు కొనుగోలు చేసే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండడం రైతుల అదృష్టమన్నారు. సమావేశంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్, సర్పంచులు వేనేపల్లి వెంకటేశ్వర్రావు, జొన్నలగడ్డ శ్రీనివాస్‌రావు, నాయకులు ఈదుల కృష్ణయ్య, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, వెంపటి వెంకటేశ్వర్రావు, విశ్వేశ్వర్రావు, కత్రం నాగేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలో నిద్ర లేకుండా గోస తీసినం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం నిద్రలేక గోస తీసినం. మళ్లీ ఆ పార్టీ వాళ్లు కనీస అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి అనడం దారుణం. ఆయనకు వ్యవసాయం గురించి తెలియదు. నాకున్న ఐదు ఎకరాల్లో పత్తి, పల్లీ, వరి పంట వేస్తా. 24 గంటలు కరెంటు ఉండబట్టే ఎప్పుడంటే అప్పుడు పోయి మోటరు పెడ్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక దర్జాగా పంట పండిస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట పొలంలో ఉండి నిద్ర కాసేది. మళ్లీ ఆ పరిస్థితి వద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల మాటలు నమ్మవద్దు. మళ్లీ సీఎం కేసీఆరే రావాలి.
– పొలగోని యల్లయ్య, రైతు, పెద్దమూల, చందంపేట మండలం
ఇప్పుడు కరెంటు గురించి దిగులు లేదు
24 గంటల కరెంటు వచ్చాకే మా కష్టాలు తీరాయి. కాంగ్రెస్ హయాంలో 9గంటలే ఉండేది. అదీ ఎప్పుడిస్తరో.. ఎప్పుడు ఇవ్వరో తెలిసేది కాదు. కరెంటు కోసం పొలాల వద్ద కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్లం. వచ్చిన కరెంటు సక్రమంగా ఉండేది కాదు. కరెంటోళ్లకు ఫోన్ చేస్తే పట్టించుకొనేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. 24 గంటల కరెంటు ఇవ్వడంతో పొలాల్లో ఎప్పుడు చూసినా నీళ్లే. ఐదారు ఎకరాల వరకు పంటలు వేసుకొంటున్నాం. గింత భూమి కూడా వదలకుండా పంట పండిస్తున్నాం. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తామంటే మేము కూడా నమ్మలేదు. ఇప్పడు ఇస్తున్నది చూసి సంతోషమవుతున్నది. కాంగ్రెసోళ్లకు కరెంటు ఇవ్వడం చేత కాలే. ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్పాలె.
– పూసపాటి రాజయ్య, రైతు, ఆలగడప, మిర్యాలగూడ మండలం
కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మొద్దు
మా తండాలో చాలా మంది రైతులు ఉన్నారు. మేమందరం ఎప్పుడూ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ వాళ్లు పచ్చి మోసగాళ్లు. వాళ్ల మాటలు ఎప్పుడూ నమ్మం. కేసీఆర్ సార్ మంచి పథకాలు ఇస్తున్నాడు. గిప్పుడు గా రేవంత్‌రెడ్డి కరెంటు వద్దు అంటున్నాడు. ఆయనకు ఏమైనా తెలుసా.. ఆయన ఎన్నడైనా వ్యవసాయం చేసిండా.. 24 గంటల కరెంటుతో ఎంతో మేలు జరుగుతుంది. పొలంలో నీళ్లు పారాలంటే ఎప్పుడూ కరెంటు ఉండాలి. అది గా రేవంత్‌రెడ్డికి తెలియదా? కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఎంతో సంతోషంగా పొలాలకు నీళ్లు పెడుతున్నాం. మేం ఎప్పుడూ కేసీఆర్‌ను మర్చిపోం.
– కాట్రావత్ పత్య, రైతు, కాట్రావత్తండా, చందంపేట మండలం