దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి తననవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆదివారం అయన చందంపేట మండలం పోలేపల్లిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడ ఇస్తున్నామన్నారు. అంతేకాక ధనవంతులతో సమానంగా సన్న బియ్యం ఇస్తున్నామని, 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు, 42 శాతం బీసీ రిజర్వేషన్ కు సిఫారసు చేసిందన్నారు. తన మంత్రిత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా దేవరకొండకు ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి పునరుద్గాటించారు.