యాదాద్రి భువనగిరి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి.
యాదాద్రి జిల్లా రాజాపేటలో అతి తక్కువగా 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలో 16.8, సూర్యాపేటలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8, 9 గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకుంటున్నది. తెల్లవారు జామున తప్పనిసరి బయటకు వెళ్లే పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5నుంచి 6గంటల తర్వాత చలి గాలులు వీస్తుండటంతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.