హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది. రిజర్వాయర్ల పర్యవేక్షణను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) పూర్తిగా గాలికి వదిలేసింది. ఆర్డర్లు, అనుమతులు లేకుండానే నీటిని తరలిస్తున్నా చోద్యం చూస్తున్నది. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ఏపీకి పరోక్షంగా వత్తాసు పలుకుతున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం బోర్డుకు ఫిర్యాదు లేఖలు రాస్తూ చేతులు దులుపుకుంటున్నది.
అందుబాటులో ఉన్నది 174 టీఎంసీలే
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటినిల్వలు వేగం గా తగ్గిపోవడంతో యాసంగి సీజన్, వేసవిలో తెలంగాణకు గతేడాది తరహాలోనే తీవ్రమైన గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సిన దుస్థితి వాటిల్లుతుందని ఆయకట్టు రైతాంగం, ఇంజినీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని నాగార్జునసాగర్ ఆయకట్టు కోసం 280 టీఎంసీలను, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కావాల్సిన 16.5 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచే విడుదల చేయాల్సి ఉంది. అదీగాక శ్రీశైలం రిజర్వాయర్ నుంచే కల్వకుర్తి లిఫ్ట్‌తోపాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎండీడీఎల్ (మినిమం డ్రా డౌన్ లెవల్) స్థాయిలో శ్రీశైలం రిజర్వాయర్‌లో కేవలం 106 టీఎంసీలు, సాగర్‌లో 68 టీఎంసీలే ఉన్నాయి. మరోవైపు ఏపీ అంతకంతకూ జలాలను మళ్లిస్తూనే ఉన్నది. అదీగాక ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో నూ ఏపీ వాటా కోసం డిమాం డ్ చేస్తున్నది.
ఏపీ సర్కార్ అత్యధిక మొత్తంలో కృష్ణాజలాలను బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడిందని ఇంజినీర్లు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలాల వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన బోర్డు పూర్తిగా గాలికి వదిలేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా వాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడానికే పరిమితమైంది. ఇప్పటికీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా, నీటి మళ్లింపును నియంత్రించకుండా పరోక్షంగా ఏపీ సర్కారుకే వత్తాసు పలుకుతున్నది. అదీగాక ఏపీ వినియోగ లెక్కలను కూడా ఆరా తీయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఇప్పటివరకు 683 టీఎంసీలను వినియోగించుకున్నా బోర్డు మాత్రం 555 టీఎంసీలకు మించి ఏపీ వాడుకోలేదంటూ లెక్కలు గడుతుండటం గమనార్హం. ఏపీ బరితెగింపునకు, బోర్డు వ్యవహారశైలికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే కారణమని ఇటు అధికారులు, అటు రైతుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఏపీని అడ్డుకోవాలని బోర్డుకు పేరుకే లేఖలు రాస్తూ చేతులు దులుపుకోవడం మినహా ఒత్తిడి తీసుకువచ్చిన దాఖలాలే లేవని మండిపడుతున్నారు.
సాగు నీటికోసం రైతన్న కన్నెర్ర ; మెదక్ జిల్లా బోనాల్ చౌరస్తా వద్ద పురుగుల మందు డబ్బాలతో ఆందోళన
సాగు నీటిని అందించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కాలువల ద్వారా వెంటనే గొలుసుకట్టు చెరువులు నింపి యాసంగి పంటలకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ చౌరస్తాలో రామాయంపేట- గజ్వేల్ రహదారిపై నిజాంపేట మండలం వెంకటాపూర్, చేగుంట మం డలం పూలిమామిడి గ్రామాల రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి కాలువల ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపి సాగు నీరును అందించాలని, లేనిపక్షంలో పురుగుల మందే శరణ్యమని హెచ్చరించారు. రెండేండ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నదని, ఈ ఏడాది పంటలకు సాగు నీరు అందించకపోతే పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉన్నదని, పెట్టుబడులతోసహా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో తహసీల్దార్ శివప్రసాద్, ఆర్ఐ జయభారత్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ మమత, కాలువ డీఈ నరేశ్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. రెండు రోజుల్లో కాలువల ద్వారా సాగునీరు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన
విరమించారు.
ఇండెంట్లు లేకుండానే నీటిసంవత్సరం!
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. నవంబర్ నెలాఖరువరకు కూడా ఎగువ నుంచి కృష్ణాలో వరద ప్రవాహం కొనసాగింది. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. పలుమార్లు క్రస్ట్‌గేట్లను లిఫ్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ నుంచి మే 31 వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటినిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రీ మెంబర్ కమిటీ నిర్ణయిస్తూ వస్తున్నది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటుచేస్తుంది.
రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ర్టాలకు నీటివాటాలను కేటాయిస్తుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకూ రివర్ బోర్డు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఎలాంటి నీటి విడుదల ఉత్తర్వులూ జారీచేయలేదు. కానీ ఏపీ మాత్రం జూలై నుంచే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల మళ్లింపును యథేచ్ఛగా చేపట్టింది. కోటాకు మించి ఇప్పటికే జలాలను తరలించింది. ఇప్పటికీ నిరంతరాయంగా కృష్ణా జలాలను తరలిస్తున్నది. తెలంగాణ సర్కారు మాత్రం కనీసం తమ పూర్తి కోటా మేరకు జలాలను వినియోగించలేకపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత స్వల్పంగా కృష్ణా జలాలను ఈ ఏడాది తెలంగాణ వాడుకున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఔట్లెట్ల వారీగా ఏపీ మళ్లించిన జలాలు
ఔట్లెట్ మళ్లించిన జలాలు
తెలంగాణ వాడుకున్న జలాలు..
ఔట్లెట్ వాడుకున్న జలాలు
(నోట్: జనవరి 31వరకు వాడుకున్న నీటి లెక్కలు)
