నల్లగొండ సిటీ, అక్టోబర్ 22 : వానాకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కనగల్ మండలం పర్వతగిరి వద్ద గల శ్రీ వెంకట సాయి రైస్ ఇండస్ట్రీస్ ను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు పంపించే విధంగా మండల యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉండి రైతులకు అవగాహన కల్పించాలని, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, తాసీల్దార్ పద్మ, ఏపీఎం మెనేజర్ మహేశ్వరరావు ఉన్నారు.