నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్27(నమస్తే తెలంగాణ)/చౌటుప్పల్/వలిగొండ : ట్రిపుల్ ఆర్ దక్షిణభాగంలో ఇష్టారాజ్యంగా చేస్తున్న అలైన్మెంట్ మార్పులతో పాటు ఉత్తరభాగంలో ఇవ్వజూపుతున్న పరిహారం దేనికి సరిపోదని బాధితులు నిత్యం తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్దిరోజులుగా పార్టీలకు అతీతంగా ట్రిపుల్ ఆర్‌లో భూములు, ఇండ్లు, ఖాళీ ప్లాట్లు కోల్పోతున్న బాధితులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరుబాట పట్టారు. ఇప్పటికే దశలవారీగా ఎక్కడికక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు, ఇవ్వాలనుకుంటున్న పరిహారంపై స్థానిక అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ల దాకా తమ గోడును వెల్లబోసుకున్నారు. అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన రాష్ట్ర నేతలను కలిసి తమ ఆవేదనను విన్నవించారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో దక్షిణ, ఉత్తర భాగాలు కలిసే జంక్షన్‌ను ఉన్నట్టుండి పెంచడం వల్ల జరిగే అదనపు నష్టాన్ని వివరిస్తూ తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ గురించి ఆలోచించాలని పలుమార్లు కలిశారు. ట్రిపుల్ఆర్కు తాము వ్యతిరేకం కాదంటూనే వాస్తవ అవసరాల మేరకే అలైన్‌మెంట్‌ను రూపొందించి అందుకు అనుగుణంగా భూమి సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచీ.. అధికార పార్టీ ముఖ్యుల నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో బాధితులు తమ పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
చౌటుప్పల్‌తో పాటు వలిగొండ మండలంలోని పలు గ్రామాల బాధితులు శుక్రవారం ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో చౌటుప్పల్ సమీపంలోని శుభం కన్వెన్షన్హాల్లో భేటీ అయ్యారు. దీనికి ట్రిపుల్ ఆలైన్మెంట్ మార్పు బాధితులతో పాటు తమ భూములు, ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో ఇప్పటివరకు తాము చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమాలపై సమీక్షించుకున్నారు. అయినా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాలని నిర్ణయించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ చౌటుప్పల్ మున్సిపాలిటీలో జంక్షన్ పరిధి పెరుగకుండా చూడాలని వీలైతే మున్సిపాలిటీ బయట నుంచి అలైన్మెంట్ మార్పు కోసం పోట్లాడాలని అనుకున్నారు. దీంతో పాటు అలైన్మెంట్లో పోతున్న భూములకు, ఇండ్లకు, ప్లాట్లకు పరిహారం కూడా మార్కెట్ రేట్లకు దరిదాపుల్లో ఇచ్చే వరకు పోరాడాలని పేర్కొన్నారు. వాస్తవంగా ఇక్కడ ఒక్కో ఎకరం కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల వరకు ధర పలుకుతున్నది. ప్లాట్ల ధరలు గజం 20వేల నుంచి 30వేల వరకు పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎక్కువలో ఎక్కువగా ఎకరానికి 38లక్షల వరకు పరిహారంగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేశారు. తక్కువలో అంటే వలిగొండ మండలం వర్కట్‌పల్లి లాంటి చోట్ల ఎకరాకు 26లక్షల వరకు పరిహారం రావచ్చని భావిస్తున్నారు. మార్కెట్ ధరలో కనీసం 30శాతం కూడా పరిహారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వంపై పోరాటాల ద్వారా ఒత్తిడి తెస్తూనే కోర్టుల మెట్లు ఎక్కాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాయగిరి రైతులు హైకోర్టులో తమ సమస్యలతో న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా వలిగొండ మండలం వర్కట్‌పల్లి రైతులు కొందరు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. పాత అలైన్మెంట్ ప్రకారమే భూములు సేకరించాలని, మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్న అంశాలతో కోర్టును ఆశ్రయించినట్లు రైతులు వెల్లడించారు. అయితే ఇదే మండలంలోని పహిల్వాన్పూర్, రెడ్డరేపాక, ప్రొద్దుటూర్లలో త్రీడీ నోటీసులు జారీ చేయగా వర్కుట్‌పల్లి, గోకారం రైతులు నిరాకరించారు. తమ గ్రామాల్లో ట్రిపుల్ సర్వేను సైతం అడ్డుకుంటున్నారు. ఇదే క్రమంలో హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. ఇదే విధంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బాధితులు సైతం లీగల్ పోరాటంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కొందరు బాధితులు ట్రిపుల్‌ఆర్‌లో తమకున్న భూములు లేదా ఆస్తులను మొత్తంగా ట్రిపుల్‌ఆర్‌లో కోల్పోవాల్సి వస్తుండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే అందరూ కలిసి సమిష్టి పోరాటానికి సిద్ధమైనట్లు ఐక్యవేదిక నేతలు చింతల దామోదర్‌రెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి ప్రకటించారు.
అక్టోబర్ 1న భువనగిరి జిల్లా పరిధిలోని ట్రిపుల్ఆర్ బాధితులంతా చలో ఇందిరాపార్క్‌కు పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన బాధితుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ప్రభుత్వ దృష్టికి వచ్చేలా ఇందిరాపార్క్ వద్ద రోజంతా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలన్నారు. అయితే చలో ఇందిరాపార్క్‌కు బాధితులంతా తమ కుటుంబసభ్యులతో సహా తరలివచ్చేలా చూడాలని భావిస్తున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించాలని కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రధాన పార్టీల పెద్దలతో పాటు ప్రజాసంఘాల నేతలను సైతం తమకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరంతా వచ్చి తమకు మద్దతు ఇస్తే తమ గోడు ప్రభుత్వం దృష్టికి పోతుందని, తద్వారా తమ ఉపశమనం లభించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ట్రిబుల్ఆర్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం భూమికి భూమి ఇచ్చి ఆదుకోవాలి. నాకు ఉన్న వ్యవసాయ భూమిలో రెండున్నర ఎకరాలు రోడ్డుకు పోతున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని పైస పైస పోగేసి కొనుకున్న భూమిని రోడ్డు కోసం తీసుకుంటే నాకుటుంబం ఎట్ల బతుకాలే. ప్రభుత్వమే న్యాయం చేసి మమ్ములను ఆదుకోవాలి. రోడ్డుకు ఎంత భూమి పోతే అంత భూమిని ప్రభుత్వం దగ్గర పట్ల ఇయ్యాలె. లేకపోతే మా బతుకులు ఆగమే. ప్రభుత్వం భూమికి భూమి ఇస్తామంటేనే రోడ్డు కోసం భూమిస్తా లేకపోతే ఏ ఒక్క అధికారిని భూమిలోని అడుగుపెట్టనియ్య. ఎంతవరకైనా సరే, కోర్టులో చూసుకుంట.
-మాడ్గుల లచ్చయ్య, రైతు, వర్కట్‌పల్లి, వలిగొండ మండలం
మా ముగ్గురు అన్నదమ్ముళం కలిసి 6 ఎకరాలు కష్టపడి కొనుకున్నం. దాంటో నాలుగున్నర ఎకరాలు పోతున్నది. మాకు వ్యవసాయమే పెద్ద దిక్కు. పంటలు పండించుకునే పిల్లలను చదివించినం. భూమిని నమ్ముకునే ఇన్నాళ్లు బతికినం. మాకు వేరే పని తెల్వదు. ఉన్న భూమి పోతే ఏమి పనిచేయాలి.
-మంద జనార్దన్ రెడ్డి, మందోళ్ల గూడెం, చౌటుప్పల్