సూర్యాపేట, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యం పేదలకు దూరమవుతున్నది. నాణ్యమైన వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందకపోగా వసతులు లేమితో దవాఖానలు అధ్వానంగా మారాయి. దాంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి స్థానిక జనరల్ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించారు.
జిల్లావాసులతోపాటు నల్లగొండ, వరంగల్, జనగాం జిల్లాలు, ఏపీ ప్రజలకు కూడా ఈ ఆస్పత్రిలో అత్యున్నత వైద్యాన్ని పొందారు. మంచి పేరున్న ఈ దవాఖానలో సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తిరోగమనంలోకి వెళ్తున్నది. ప్రసవాలు, ఓపీ సేవలు తగ్గుముఖం పట్టగా రోగులకు అవసరమైన యాంటీబయాటిక్, కాల్షియం, గ్యాస్ వివిధ రకాల మందులు అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో రోగులు దవాఖానకు వచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు రికార్డులను బట్టి తెలుస్తున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు ఖరీదైన అత్యున్నత వైద్యాన్ని అందించేందుకు ప్రతి జిల్లా కేంద్రానికో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటకు మెడికల్ కళాశాల తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. ఇక్కడ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా జనరల్ ఆస్పత్రుల్లో కాన్సర్, మోకీళ్ల మార్పిడి తదితర చికిత్సలు చేశారు. ఎన్నో ఖరీదైన రక్త పరీక్షలు ఉచితంగా చేశారు. సాధారణ రోగులు, గర్భిణులతో ఆస్పత్రి కిటకిటలాడేది. కొవిడ్ సమయంలో చాలా మందికి ఈ దవాఖాన ప్రాణం పోసింది. రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తర్వాత సూర్యాపేట జనరల్ దవాఖానకు మంచి పేరు వచ్చింది. సీటీ స్కానింగ్, రికార్డు స్థాయిలో ఓపీలతో పాటు ఆరోగ్యశ్రీ సర్జరీలో ఈ ఆస్పత్రికి అవార్డులు సైతం వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు వైద్యంపై నిర్లక్ష్యం ఆవహించింది. సూర్యాపేట జనరల్ దవాఖానలో పడిపోయిన వైద్య సేవలే ఇందుకు నిదర్శనం. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులే చికిత్స అందిస్తుండడం, సరైన మందులు లేకపోవవడం, డయాగ్నస్టిక్ హబ్ ఉన్నప్పటికీ అన్ని రకాల పరీక్షలు చేయకపోవడం వంటి కారణాలతో ఈ దవాఖానకు రావడానికి జనం విముఖత చూపుతున్నారు. టెస్టులకు కావాల్సిన మెటీరియల్ తెప్పించుకోకపోవడంతో డయాగ్నస్టిక్ హబ్‌లో టెస్టులు తగ్గిపోయాయి.
ఇక చిన్న, పెద్ద వ్యాధులకు అత్యవసరమైన యాంటీ బయాటిక్, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ చాలా వరకు లేవు. డాక్టర్లు చుట్టపు చూపుగా వస్తుండడం, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులే ఇంటెన్షిప్ సమయంలో డాక్టర్ పక్కన కూర్చుని నేర్చుకోవాల్సి ఉండగా వారే చికిత్సలు అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. సూపరింటెండెంట్లు, హెచ్ఓడీలు వారంలో రెండు నుంచి మూడు రోజులే దవాఖానకు వచ్చి వెళ్తున్నారని, మరీ వారికి అటెండెన్స్ ఎలా వేస్తున్నారో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేషెంట్లు భారీగా రావడంతో సిబ్బంది ఇబ్బందులు పడగా, ప్రస్తుతం ఆస్పత్రి పట్ల నిర్లక్ష్యం ఆవహించడంతో పేషెంట్లు తగ్గిపోతూ సిబ్బందికి పనిలేక డుమ్మాలు కొడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలితే ఈ ఆస్పత్రిలో ఇబ్బందులు తప్పవేమో.
సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో 2023 జనవరిలో 370 ప్రసవాలు జరుగగా 2024 జనవరిలో 336 జరిగాయి. 2023 ఫిబ్రవరిలో 316 ప్రసవాలు కాగా 2024 ఫిబ్రవరిలో 283, 2023 మార్చిలో 360 కాగా 2024లో 325, 2023 ఏప్రిల్‌లో 420 కాగా 2024 ఏప్రిల్‌లో 417 జరిగాయి. ఈ లెక్కన ప్రతినెలా ప్రసవాలు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది వరకు వివిధ వ్యాధులకు చికిత్స కోసం ప్రతి నిత్యం జనరల్ దవాఖానకు 180 నుంచి 200 మంది ఓపీ పేషెంట్లు రాగా నేడు రోజుకు 100కు మించి రావడం లేదు.