ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల మేర ఎకువగా రికార్డవుతున్నాయి. తేమ శాతం తగ్గడంతో జనం ఉకపోతతో ఇబ్బంది పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
– సూర్యాపేట, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ)
ఈసారి అప్పుడే భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండని చూసి ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలో ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేటలో 37 డిగ్రీలు, ఆలేరులో 36.9, బీబీనగర్, రామన్నపేటలో 36.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.8 డిగ్రీలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 20 రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతున్నది.
జిల్లాలో కరెంట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో విరివిగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. గత నెలలో రోజుకు 8 మిలియన్ యూనిట్ల కరెంట్ వాడగా, ఇటీవల 9 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఎండలు, ఉకపోత ధాటికి తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరులో 10 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చలి కాలం పోయి, వేసవి వచ్చేస్తున్నది. దీంతోపాటు సీజనల్ వ్యాధులు కూడా దరి చేరే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు, అతిసారం, నీళ్ల వీరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్లో వచ్చే ఆటలమ్మ(చికెన్ పాక్స్), కామెర్లు వచ్చే ఆసారం ఉంది. గవద బిళ్లలు, టైఫాయిడ్ , పొంగు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎండలు ఎకువగా ఉండటంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసే వారు సూర్యరశ్మి కాపాడుకునేలా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కాఫీలు, టీలు అధిక వేడి సమయంలో తీసుకోకూడదు.
చలి కాలం ముగుస్తున్నది. వేసవి సమీపిస్తున్నది. కాలం మారుతుండటంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నీరు ఎంత ఎకువ తీసుకుంటే అంత మంచిది. ఎండలో ఎకువగా తిరిగితే డయేరియా రావొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలి.
– డాక్టర్ అనిల్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్, భువనగిరి