సూర్యాపేట, జనవరి 22 : అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట పట్టణ పోలీసు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 2 వేల మంది విద్యార్థులు, ఆటో, భారీ వాహనాల డ్రైవర్స్, స్థానిక యువత, పౌరులతో కలిసి గురువారం భారీ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహ ప్రారంభించారు. స్థానిక 60 ఫీట్ల రోడ్డు నుండి ప్రారంభమై నళ్లాలబావి సెంటర్, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్, ట్యాంక్ బండ్ చౌరస్తా మీదుగా ఏవీఎం స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, పౌరులకు 150 హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏవీఎం స్కూల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
నేటి బాలలే రేపటి పౌరులు కావునా రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి, అంబాసిడర్స్ గా ఉండాలన్నారు. తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల వారికి రోడ్డు భద్రత గురించి, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు తెలియజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని చెప్పారు. ప్రస్తుత సమాజంలో దేశ రక్షణలో కంటే రోడ్డు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడేవారే ఎక్కువగా ఉన్నారన్నారు. దేశంలో సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వీటిల్లో 1.5 లక్షల పైగా పౌరులు మరణిస్తుండగా 4 లక్షల మంది వరకు క్షతగాత్రులు అవుతున్నట్లు తెలిపారు. మన తెలంగాణా రాష్ట్రంలో సంవత్సరానికి సగటున 7 వేల మందికి పైగా పౌరులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదాలను నివారించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత మహా ఉద్యమం ప్రారంభించడం జరిగిందన్నారు.
ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ తప్పక ధరించాలి, కారు, పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దని, తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దన్నారు. వాహనాలకు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు అని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో బాధ్యతగా ఉంటాం, రోడ్డు భద్రత నియమ నిభందనలు పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పోలీస్ కళాబృందం వారు పాటలతో రోడ్డు భద్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సునీత, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదిత్య, ఎస్ఐలు సాయిరాం, బాలు నాయక్, ఏడుకొండలు, శివతేజ, మహేందర్, బాలు నాయక్, శ్రీకాంత్, మహేశ్, ఆటోమొబైల్ షో రూమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్, పోలీసు సిబ్బంది, ఆర్టీఏ సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.