ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగియగానే పాఠశాలల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు. కానీ ఈ సారి ఆన్లైన్లో నమోదైన మార్కుల వివరాలను ఇవ్వనున్నారు. ఏడాదిలో అన్ని పరీక్షల మార్కులను ఐఎస్ఎంఎస్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టం) పోర్టల్‌లో ఇప్పటికే టీచర్లు ఎప్పటికప్పుడు నమోదు చేశారు. సోమవారం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి ప్రగతి పత్రాలను అందించనున్నారు. దీని ద్వారా పారదర్శకతతోపాటు విద్యార్థులకు ఎప్పుడైనా ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 25నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది.
– రామగిరి, ఏప్రిల్ 23
రామగిరి, ఏప్రిల్ 23: విద్యా సంవత్సరం ముగియడంతో విద్యార్థులకు సంబంధించిన ఎస్ఏ-2(సమ్మె లెటీవ్ పరీక్షలు) ఫలితాలను అందించాల్సి ఉంది. సోమవారం (ఈనెల 24) వాటిని ఆయా పాఠశాల్లో విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ పర్యాయం గతంలో మాదిరిగా కాకుండా ఆన్లైన్లో ప్రగతి పత్రాలను(ప్రోగ్రెస్ కార్డు)ను అందజేస్తుండడం విశేషం.
ఆన్లైన్లో ఫలితాలు…
విద్యార్థులకు పరీక్షలు ఈనెల 12న ముగిశాయి. అయితే ఇప్పటికే ఎఫ్ఏ 1, 2, 3, 4 ఫలితాలతోపాటు ఎస్ఏ -1 ఫలితాలను ఆన్లైన్ ఆయా ఆపాఠశాలలో ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఎఫ్ఏ-2 జవాబు పత్రాలను ఉపాధ్యాయులు ఏరోజుకు ఆరోజు మూల్యాంకనం పూర్తి చేశారు. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు జేశారు. అయితే వీటితో గతంలో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను పాఠశాల చివరి పనిదినం రోజు అందజేసేవారు. కానీ ఈ పర్యాయం వాటి స్థానంలో ఆన్లైన్లో ప్రగతి పత్రాలను డౌన్లోడ్ చేసి పూర్తి సమాచారంతో అందజేయనున్నారు. అంతేకాకుండా గతంలో ప్రోగ్రెస్ కార్డులను విద్యాశాఖ సమగ్రశిక్ష నుంచి సరఫరా చేసేది. ప్రస్తుతం వాటి సరఫరా లేకపోవడంతో గత సంవత్సరం ఆన్లైన్ ప్రగతి పత్రాల పంపిణీనికి చర్యలు తీసుకోగా పూర్తి స్థ్ధాయిలో అమలు కాలేదు. ఈ పర్యాయం పూర్తిగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థ్ధి ప్రస్తుతం చదివే బడి వదిలి కొత్త పాఠశాలలకు ప్రవేశాలకు వెళ్లే సందర్భంలో టీసీతోపాటు ఆన్లైన్ ప్రగతి నివేదిక పత్రం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి సంతకం చేసి అందజేయాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 2.27లక్షల విద్యార్థులు…
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ఫ్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 2, 27, 345మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ సోమవారం ఆయా పాఠశాలల్లో ఆన్లైన్ ప్రగతి పత్రాలను డౌన్లోడ్ చేసి ప్రధానోపాధ్యాయుడి సంతకంతో అందజేయనున్నారు.
రేపటి నుంచి వేసవి సెలవులు…
పాఠశాలలో 1నుంచి 9వతరగతి చదివే విద్యార్థులకు ఈనెల 25నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి జూన్ 11 పాఠశాలలు పునఃప్రారంభకానున్నాయి. అయితే వాస్తవానికి జూన్ మొదటి వారం నుంచి బడిబాట కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. 48 రోజుల పాటు సెలవులు వస్తుండటం విశేషంగా చెప్పవచ్చు. దాంతో నేడు ఈనెల 24న పాఠశాలల ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినంగా చెప్పవచ్చు .
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేయాలి
రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలలో 1నుంచి 9వతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ పర్యాయం ఆన్లైన్ ప్రగతి పత్రాలు(ప్రొగ్రెస్ కార్డు)లను అందజేయాలి. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన ప్రగతి పత్రాలపై ప్రధానోపాధ్యాయుల సంతకం చేసి అందించాలి. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లాలో అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, విద్యార్థుల భవిష్యత్‌కు నాంది పలికెలా చర్యలు తీసుకుంటున్నాం
-బి.భిక్షపతి, డీఈఓ నల్లగొండ