తిరుమలగిరి/నకిరేకల్/శాలిగౌరారం/కోదాడ రూరల్/అనంతగిరి/ఆత్మకూర్.ఎస్/ ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 14 : వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి జిల్లాలో కోతకొచ్చిన వరి పొలాలు దెబ్బతిన్నాయి. కలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. మామిడి, నిమ్మ కాయలు నేలరాలాయి. పలుచోట్ల చె ట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో తీవ్ర నష్టం కలిగింది. అనంతగిరి మండలం, కోదాడ మండలం కాపుగల్లు, తొగర్రాయిలో వరితోపాటు మామిడి పంటలు దెబ్బతిన్నాయి.
తిరుమలగిరి మండలంలో వర్షానికి 20 ఎకరాలకుపైగా చేతికొచ్చిన వరి పొలంలోనే రాలిపోయింది. నకిరేకల్ మండలంలో 150 మంది రైతులకు చెందిన 570 ఎకరాల్లో నిమ్మతోట ధ్వంసమైంది. చెట్లు కూలిపోయి, కాయలు రాలి నష్టం జరిగిందని నకిరేకల్ ఉద్యానవశాఖ అధికారి ప్రవీణ్ తెలిపారు. శాలిగౌరారం మండలంలోని పెర్కకొండా రం, వల్లాల, ఆకారం గ్రామాల్లో నిమ్మతోపా టు బత్తాయి తోటలు దెబ్బతిన్నా యి. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంతోపా టు బోరింగ్తండా, పాతర్లపహాడ్, ఇస్తాలాపురంలో పొలంలోనే వరి ధాన్యం, మామిడి కా యలు రాలిపోయాయి. మోటకొండూరు మండలంలోని తేర్యాల, ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్, రేగులకుంట, చిన్నగూడెం గ్రామాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి.