కట్టంగూర్, ఏప్రిల్ 10 : కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ గురువారం ఎస్సీ, ఎస్టీ నల్లగొండ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. 2018 సెప్టెంబర్ 17న మండలంలోని గార్లబాయిగూడెంకు చెందిన పాల్వాయి రాంరెడ్డి అదే గ్రామంలో బేడ బుడిగ జంగం కులానికి చెందిన ఓ వ్యక్తి భూమిలోకి అక్రమంగా ప్రవేశించాడు. అడ్డుకోబోయిన ఆ వ్యక్తిని కులం పేరుతో దూషించడంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఏఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేశారు.
నాటి డీఎస్పీ సుధాకర్ దర్యాప్తు చేయగా తదుపరి డీఎస్సీ గంగారాం అంతిమ నివేదికను కోర్టులో ఫైల్ వేశాడు. దీనిపై గురువారం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరిగిన అనంతరం నిందితుడు దోషిగా తేలడంతో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ తెలిపారు.