నీలగిరి, జనవరి 16 : నల్లగొండ జిల్లా కేంద్రంలో హత్య ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ జరగడంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ కారణంగా దాడి చేసుకోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని నాగర్కర్నూల్ జిల్లా తెలికపల్లి గ్రామానికి చెందిన చంద్రుగా గుర్తించారు. రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వే పనుల నిమిత్తం నల్లగొండకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చంద్రు అన్నతో పాటు వారి మేస్త్రీకి గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టిన టూ టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. చంద్రుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రోజువారీ కూలి కేవలం రూ.250 తో జీవనాన్ని నెట్టుకొచ్చే చంద్రు కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడిందని, ఆదుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.