దేవరకొండ, మే 31 : దేవరకొండలోని హనుమాన్గర్కు చెందిన కేతావత్ శరత్‌కుమార్ ఇంట్లో గతేడాది అక్టోబర్‌లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి రమాండ్కు తరలించినట్లు దేవరకొండ సీఐ బీసన్న తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవరకొండ బస్టాండ్ వద్ద అనుమానాస్పందంగా సంచరిస్తున్న డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన దమ్మోజు భగవంత్చారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు.
భగవంత్చారి దేవరకొండలోని హనుమాన్‌నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకొని వండ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసైన అతను సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతేడాది అక్టోబర్‌లో అదే కాలనీకి చెందిన కేతావత్ శరత్‌కుమార్ ఇంట్లోకి ప్రవేశించి రెండు తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులతో పాటు రూ. 20వేల నగదు, ట్యాబ్‌ను ఎత్తుకెళ్లాడు. నిందితుడి నుంచి ట్యాబ్, రెండు తులాల బంగారం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ బాలకిషన్, కానిస్టేబుల్ హేమునాయక్ను సీఐ అభినందించారు.