సూర్యాపేట, డిసెంబర్ 04 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని, మెజార్టీ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.345 కోట్లు గ్రామాలకు కేటాయించి గ్రామ స్వరాజ్యం తెచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో ట్రాక్టర్లు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని, గ్రామాల్లో సెక్రటరీలు సైతం తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంతో అనుభవం ఉందని, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని బెదిరింపులకు గురిచేస్తూ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ డబ్బు, మద్యంతో గెలవచ్చనే భ్రమలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలతో పాటు విద్య, వైద్యం, రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలను పట్టించుకోవడం లేదని, రైతులకు బోనస్, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, కనీసం వడ్లు పండిస్తే కొనే దిక్కు లేదన్నారు. పెన్షన్లు పెంచుతామని పెంచలేదు.. విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు.. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదు.. యువతకు ఉద్యోగాలు లేవు.. ఇలా ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిందన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక వాడలకు ఇచ్చిన భూములను అమ్ముకునే ఆలోచన చేస్తున్నారని, ఇది రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణం అన్నారు. దోచుకో దాచుకో పంచుకో అన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజలు అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని, ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, జానకిరామ్ రెడ్డి పాల్గొన్నారు.