KD: The Devil | బాలీవుడ్ నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ సినిమాల్లో పెరుగుతున్న అశ్లీలతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల నోరా ఫతేహి నటించిన ‘KD: The Devil’ చిత్రంలోని ‘సర్కే చునార్’ అనే పాటలో మహిళలను కించపరిచేలా ఉన్న సాహిత్యంపై ఆయన స్పందిస్తూ.. సమాజంలో సంస్కృతిని, విలువలను దెబ్బతీసేలా ఉండే ఏ అశ్లీలతను కూడా ప్రజలు ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు. కేవలం సినిమాకు హైప్ తీసుకురావడానికో లేదా యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడానికో ఇలాంటి అసభ్యకరమైన అంశాలను చొప్పించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. అశ్లీలత లేకుండానే వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సినిమాలను ఉదాహరణగా తీసుకోవాలని, కంటెంట్ బాగుంటే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే ఈ పాటలోని సాహిత్యంపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఆ పదాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.