తుంగతుర్తి, జనవరి 29 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజారాం పిలుపునిచ్చారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్మిక సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను తెచ్చిందని, వీటి వల్ల కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, యాజమాన్యాలతో బేరసారలు చేసుకోవడం, సమ్మె చేసుకునే హక్కు, పని గంటలు పెంచి కార్మిక వర్గంపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.15 వేలు వేతనం పొందే కార్మికులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులు, కార్మికులుగా గుర్తించబడరని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా ట్రీట్ చేస్తూ కార్మిక చట్టాలు వీరికి వర్తించకుండా దూరం చేయనున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కోటా రామస్వామి, పాల్వాయి పున్నయ్య, మనోజ్, నరసయ్య, టీయూసీఐ నాయకులు మామిడి సుధాకర్, గుండగాని వెంకన్న పాల్గొన్నారు.