సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 11 : చదువుతోనే సర్వం సాధ్యమని, ఎక్కడైతే పురుషులతో సమానంగా మహిళలు విద్యావంతులుగా ఉంటారో ఆ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని.. సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి వివక్షతను జయింయిచిన గొప్ప వ్యక్తి పూలే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం మహాత్మా పూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డు గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆడవాళ్లు కేవలం వంటింటికే పరిమితమన్న వివక్షను జయించి మహిళలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. అతని భార్య సావిత్రీబాయి పూలేను పెండ్లి చేసుకున్న అనంతరం ఉన్నత చదువులు చదివించి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లి మహిళల్లో చైతన్యం నింపి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఆమెను వెన్నుతట్టి ముందుకు నడిపిన మహోన్నతమైన వ్యక్తి పూలే అన్నారు.
ఎందరో మహనీయుల కలలను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. 2014కు ముందు పాలించిన పాలకులు పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను నీరుగారిస్తే, సీఎం కేసీఆర్ మాత్రం పెద్దపీట వేస్తూ నవ సమాజ నిర్మాణానికి సరికొత్త బాటలు వేస్తున్నారన్నారు. సబ్బండ వర్గాల సాధికారత, సంక్షేమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నిరుపేద, బడుగు బలహీన వర్గాల్లో విద్యాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. మహనీయులను గౌరవించడంలోనూ తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. అన్నివర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. మహాత్మా పూలే వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగందర్రావు, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, మోహన్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిళ్లే, నాయకులు వై.వెంకటేశ్వర్లు, డాక్టర్ రామ్మూర్తియాదవ్, చింతలపాటి చిన్న శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, తళ్లమల హస్సేన్, కూసుకుంట్ల శారదాదేవి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.