చౌటుప్పల్, డిసెంబర్ 27 : మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్‌లో ఆ సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తుండడంతో అద్దె బస్సులో కెపాసిటీకి మించి 100 నుంచి 120 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న అందరికీ ఇన్సూరెన్స్ వర్తించేలా మార్పులు చేపట్టాలని కోరారు.
అంతేకాకుండా అధిక లోడు మూలంగా మెయింటనెన్స్ పెరిగి మరింత ఆర్థికభారం పడుతుందన్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఇచ్చే రేటు మీద కిలోమీటర్‌కు రూ.3 పెంచాలన్నారు. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులకు కేఎంపీఎల్‌ను 4.5కు తగ్గించాలని, ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. లేకుంటే వచ్చే నెల 5 నుంచి బస్సులను నడుపలేమని ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకాంతం మహిపాల్‌రెడ్డి, కోశాధికారి ఎన్.సత్యంబాబు, నాయకులు కందాల శ్రీనివాస్‌రెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, బాలవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.