నల్లగొండ రూరల్, ఆగస్టు 30 : అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే వారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైనా పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ అంశాలపై ఆ శాఖల జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా మెర్జింగ్, మ్యాపింగ్‌పై సమీక్షిస్తూ ఆర్డీఓలతో సమన్వయం చేసుకుని సెప్టెంబర్ నాటికి పోల్ పోర్టల్‌లో మెర్జింగ్, మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 3 వరకు మ్యానువల్ పరిశీలన అవ్వాలన్నారు.
సెప్టెంబర్ 4 నుంచి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరుగుతుందని, 4 నుంచి 10 వరకు ఎంపీడీఓలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉన్నదీ లేనిది తనిఖీ చేయాలన్నారు. 15 నాటికి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను సర్పించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్షిస్తూ జిల్లాలో వైరల్ ఫీవర్స్‌తోపాటు డెంగ్యూ వంటి కేసులు నమోదవుతున్నాయని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో గడ్డి మొక్కలు తొలగించే యంత్రాలు, ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయాలన్నారు.
తాగునీరు కలుషితం కాకుండా చూడాలని చెప్పారు. అంగన్వాడీ, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నదీ, లేనిది నిర్ధారణ చేసుకుని అప్రమత్తం చేయాలన్నారు. పీహెచ్సీ డాక్టర్లు అవసరమైతే మళ్లీ జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడుకుండా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వచ్చే మంగళవారం నుంచి శానిటేషన్, ప్లాంటేషన్‌పై ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తాయని తెలిపారు.
ఎక్కడైనా పారిశుధ్య లోపం కనపడినా, మొక్కలు లేకపోయినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ మురళి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇరిగేషన్ ఏఈలు పాల్గొన్నారు.